4 March, 2026 | 7:24 PM

శ్లోక పాఠశాలకు ఉత్తమ రక్తదాన శిబిర మోటివేటర్ పురస్కారం అందజేత

04-03-2026 05:48 PM

ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు

కామారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్లోక పాఠశాల సెక్రటరీ కరస్పాండెంట్ జలిగామ శ్రీకాంత్ కు ఉత్తమ రక్తదాన శిబిర మోటివేటర్ పురస్కారం -2026 ను ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్), కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, ఐవిఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్ లు మాట్లాడుతూ... తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలకు శ్లోక పాఠశాల సెక్రటరీ కరస్పాండెంట్ జలిగామ శ్రీకాంత్ సహకరించడం జరుగుతుంది.

పాఠశాల అంటే కేవలం విద్య మాత్రమే కాదని విద్యతో పాటుగా సామాజిక సేవలో విద్యార్థులను భాగస్వాములుగా చేయడం ఎంతగానో అభినందనీయమని అన్నారు. రక్తదాన శిబిరం నిర్వహించాలంటే చాలామంది సహయ, సహకారాలు అవసరం అవుతాయని,రక్తదాన శిబిరాలకు సహకరిస్తున్న వారందరికీ అవార్డులను అందజేయడం జరుగుతుందని అన్నారు.

తల సేమియా బాధిత చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒక యూనిట్ రక్తం వారి జీవితాంతం అవసరం ఉందని అలాంటి చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి రాబోయే రోజుల్లో మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహిస్తామని అన్నారు. ఈ శిబిరాలను విజయవంతం చేయడానికి సామాజిక సేవకులు, రక్తదాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.