ఢిల్లీలో కాంగ్రెస్‌కు షాక్

02-05-2024 12:05:00 AM

పార్టీని వీడిన ఇద్దరు సీనియర్ నేతలు

ఆప్‌తో పొత్తు నచ్చక రాజీనామాలు

న్యూఢిల్లీ, మే 1: ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు ఢిల్లీకి చెందిన ఇద్దరు నేతలు షాకిచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్వత్వానికి రాజీనామా చేశారు. ఢిల్లీలోని రెండు లోక్‌సభ స్థానాలకు పరిశీలకులుగా ఉన్న నీరజ్ బసోయా, నసీబ్ సింగ్.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు వేర్వేరుగా రాజీనామా లేఖలు పంపారు. ఇప్పటికే ఢిల్లీ పీసీసీ చీఫ్‌గా అర్వింద్ సింగ్ లవ్లీ రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్‌కు షాక్ మీద షాక్ తగులుతోంది. ఢిల్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం తనకు నచ్చలేదని పశ్చిమ ఢిల్లీ పార్లమెంట్ పరిశీలకులుగా ఉన్న నీరజ్ బసోయా తెలిపారు.

ఢిల్లీలో ఆప్‌తో పొత్తుపెట్టుకోవడం పార్టీకి, కార్యకర్తలకు ఇబ్బందికరంగా మారింది. ఆత్మగౌరవం ఉన్న నాయకుడిగా నేను ఇకపై పార్టీతో కలిసి ఉండలేను. అందుకే పార్టీ కేటాయించిన పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. సామాన్య పౌరుడినైన నాకు గత 30 ఏళ్ల పాటు వివిధ పదవులు కట్టబెట్టిన కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాఅని తన రాజీనామా లేఖలో నీరజ్ పేర్కొన్నారు.    

డీపీసీసీ చీఫ్ నియామకం నచ్చక.. 

ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్‌గా దేవేందర్ యాదవ్ నియామకం పట్ల మాజీ ఎమ్మెల్యే, వాయువ్య ఢిల్లీ పార్లమెంట్ పరిశీలకులు నసీబ్ సింగ్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలిపారు. పంజాబ్‌లో అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన దేవేందర్.. ఢిల్లీలో మాత్రం ఆప్ అజెండాను అమలు చేస్తున్నారు. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నాఅని నసీబ్ తెలిపారు. కాగా, ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అర్వింద్ సింగ్ శనివారం రాజీనామా చేశారు. ఆప్‌తో పొత్తు పెట్టుకోవడం అసంతృప్తి కలిగించిందని ఖర్గేకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. అధ్యక్ష పదవికి రాజీనామా చేసినా పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.