calender_icon.png 14 February, 2026 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్‌కు షాక్

14-02-2026 12:28:25 AM

రెండు మున్సిపాలిటీలలో బీఆర్‌ఎస్‌కు మెజారిటీ 

ఒకచోట కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ 

అయినా చైర్పర్సన్ పదవి కష్టమే! 

ఒక వార్డులో కాంగ్రెస్ అభ్యర్థికి నాలుగే ఓట్లు 

సత్తా చాటిన బీజేపీ 

బీజేపీ, ఎక్స్ అఫీషియో ఓట్లే కీలకం 

మేడ్చల్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిక్యం సాధించగా, మేడ్చల్ జిల్లాలో ఆ పార్టీకి ఓటర్లు షాక్ ఇచ్చారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలలో ఒక్కదానిలో కూడా కాంగ్రెస్ మెజారిటీ సాధించలేదు. అలియాబాద్ లో మాత్రమే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కొన్ని వార్డులలో ఆ పార్టీకి ఘోరంగా ఓట్లు పోలయ్యాయి. ఎల్లంపేటలోని 24వ వార్డులో అధికార కాంగ్రెస్ అభ్యర్థికి కేవలం నాలుగు ఓట్లు మాత్రమే పోలయ్యాయి.

ఇదే మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులకు ఎనిమిదవ వార్డులో 29, పదవ వార్డులో 74, ఏడవ వార్డులో 90 ఓట్లు వచ్చాయి. మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో 24 వార్డులలో 9 వార్డులకు, ఎల్లంపేట మున్సిపాలిటీలో 8 వార్డులకు పరిమితమైంది. మున్సిపల్ ఎన్నికలకు ఇన్చార్జి మంత్రిని నియమించి, స్థానిక సీనియర్ నాయకులకు మున్సిపాలిటీల బాధ్యతలు అప్పగించగా, వారు సర్వశక్తులు ఒడ్డీనప్పటికీ మెజారిటీ రాకపోవడంతో కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఘోరంగా ఓట్లు పోల్ కావడానికి కారణాలపై విశ్లేషించుకుంటున్నారు.

సత్తా చాటిన బీఆర్‌ఎస్

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సత్తా చాటింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సమయంలో బిఆర్‌ఎస్ పూర్తి అనుకూల పరిస్థితి ఉండగా, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం తో కొంత పుంజుకుంది. అయినప్పటికీ బి.ఆర్.ఎస్ ఆదిక్యత చాటుకుంది. ఎమ్మెల్యే మల్లారెడ్డి వ్యూహంతో ప్రచారంలో ముందుకెళ్లారు.

అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కి అలియాబాద్, పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి కి ఎల్లంపేట, చిన్న కుమారుడు డాక్టర్ భద్రారెడ్డికి మూడు చింతలపల్లి మున్సిపాలిటీల బాధ్యతలు అప్పగించారు. వీరు ఎప్పటికప్పుడు మున్సిపాలిటీ పరిధిలో పరిస్థితి సమీక్షిస్తూ క్యాడర్ ను, అభ్యర్థులను అప్రమత్తం చేశారు. మూడు చింతలపల్లి లో 24 వార్డులలో 14వ వార్డులను కైవసం చేసుకుంది. ఎల్లంపేటలో 12 వార్డులను, 20 వార్డులు ఉన్న అలియాబాద్ లో ఏడు వార్డులను టిఆర్‌ఎస్ గెలుచుకుంది.

కింగ్ మేకర్‌గా బీజేపీ 

ముందుగా ఊహించినట్లుగానే రెండు మున్సిపాలిటీలలో బిజెపి కింగ్ మేకర్ గా అవతరించింది. ఎల్లంపేట మున్సిపాలిటీలో నాలుగు, అలియాబాద్ మున్సిపాలిటీలో మూడు, మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో ఒక వార్డును బిజెపి గెలుచుకుంది. ఎల్లంపేట, అలియాబాద్ మున్సిపాలిటీలలో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రానందున బిజెపి ఓట్లు కీలకమయ్యాయి. ముఖ్యంగా అలియాబాద్ మున్సిపాలిటీలో బిజెపి ఓట్లు అవసరమయ్యాయి. బిజెపి తక్కువ స్థానాలే సాధించిన ఇవి అమూల్యమయ్యాయి. 

అలియాబాద్‌లో రసవత్తరం 

అలియాబాద్ మున్సిపాలిటీలో రాజకీయం రసవత్తరంగా తయారైంది. 20 స్థానాలున్న ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఎనిమిది, బీఆర్‌ఎస్ ఏడు, బిజెపి మూడు వార్డుల్లో గెలుపొందగా, బీ.ఎస్.పి, స్వతంత్రులు ఒక్కో వార్డులో గెలుపొందారు. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 11. కాంగ్రెస్కు బిఎస్పి, స్వతంత్ర కౌన్సిలర్లు మద్దతు తెలిపితే బలం 10కి చేరుతుంది. మరొక సభ్యుడు మద్దతు కావాలి. టిఆర్‌ఎస్, బిజెపి నుంచి ఒకరు కాంగ్రెస్ శిబిరంలోకి రావాలి, లేదా ఎక్స్ అఫీషియో ఓటు హక్కు వినియోగించుకోవాలి.

కాంగ్రెస్ కు ఎమ్మెల్యే, ఎంపీ లేనందున రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు ఆప్షన్ ఇవ్వాలి. ఇండిపెండెంట్, బీఎస్పీ మద్దతు కోసం బిఆర్‌ఎస్ కూడా ప్రయత్నిస్తోంది. ఈ మున్సిపాలిటీలో చైర్ పర్సన్ పదవి కైవసం చేసుకోవడానికి రెండు పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. 

ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకం 

ప్రస్తుత పరిస్థితుల్లో అలియాబాద్, మూడు చింతలపల్లి మున్సిపాలిటీలలో ఎక్స్ ఆఫీసులో ఓట్లు కీలకమయ్యాయి. స్థానికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ఎంపీ ఎక్స్ అఫీషియో ఓటు నమోదు చేసుకోవాలి.  రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు రాష్ట్రంలో ఎక్కడైనా ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో అందరి దృష్టి అలియాబాద్ మున్సిపాలిటీ పై ఉంది. ఇక్కడ చైర్మన్ ఎవరు అవుతారు అనేది ఉత్కంఠంగా మారింది.