calender_icon.png 10 February, 2026 | 3:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోహిత్, కోహ్లీకి షాక్

10-02-2026 02:11:27 AM

  1. కాంట్రాక్ట్ లిస్ట్‌లో డిమోషన్

గ్రేడ్ బీకి రోకో జోడీ పరిమితం

గ్రేడ్ ఏ ప్లస్ తొలగింపు

ఊహించిందే జరిగింది.. భారత దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి బీసీసీఐ షాకిచ్చింది. సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ 2025-26 జాబితాలో రోకో జోడీకి డిమోషన్ ఇచ్చింది. తాజాగా ప్రకటించిన జాబి తాలో రోహిత్, కోహ్లీలను గ్రేడ్ బీకి పరిమితం చేసింది. అదే సమయంలో సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి  గ్రేడ్ ఏ ప్లస్‌ను తొలగించింది. నిజానికి గత కొన్ని రోజులుగా దీనిపై వార్తలు వస్తున్నాయి.

అన్ని ఫార్మాట్లు ఆడే ప్లేయర్స్‌కు మాత్రమే గ్రేడ్ ఏ ప్లస్ వర్తిస్తుంది. గత ఏడాది వరకూ కోహ్లీ, రోహిత్ , జడేజా, బుమ్రా గ్రేడ్ ఏ ప్లస్ లోనే ఉండేవారు. ఈ కేటగిరీలో ప్లేయర్స్‌కు ఏడాదికి రూ.7 కోట్ల రూపాయల పారితోషకం అందేది. అలాగే గ్రేడ్ ఏలో ఆటగాళ్లకు రూ.5 కోట్లు, గ్రేడ్ బిలో ఆటగాళ్లకు రూ.3 కోట్లు , గ్రేడ్ సిలో ప్లేయర్స్‌కు రూ.1 కోటి రూపాయలు లభించేది. అయితే ఇప్పుడు మూడు ఫార్మాట్లు ఆడే ప్లేయర్స్ ఎవ్వరూ లేరు.

ఎందుకంటే కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజా ముగ్గురూ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. వీరిలో రోకో జోడీ టెస్టులు కూడా ఆడడం లేదు. జడేజా మాత్రమే వన్డే, టెస్ట్ ఫార్మాట్‌లు ఆడుతున్నాడు. దీంతో కోహ్లీ, రోహిత్ లను బీసీసీఐ గ్రేడ్ బికి పరిమితం చేసింది. ఒకవేళ టెస్టులు కూడా ఆడి ఉంటే గ్రేడ్ ఏలో ఉంచేదేమో. వచ్చే వన్డే ప్రపంచకప్ ఆడాలని టార్గెట్‌గా పెట్టుకున్న రోకో జోడీకి అప్పటికి చోటు దక్కుతుందో లేదోనన్న దానిపైనా క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే తాజా జాబితాలో గ్రేడ్ ఏలో కేవలం ముగ్గురికి మాత్రమే చోటు దక్కింది. గిల్ , బుమ్రా, జడేజా మాత్రమే గ్రేడ్ ఏలో చోటు దక్కించుకున్నారు.

గ్రేడ్ బిలో రోకో జోడీతో పాటు కేఎల్ రాహుల్, సిరాజ్, వాషింగ్టన్ సుందర్, పాం డ్యా, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, జైస్వాల్ , సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్‌లకు చోటు దక్కింది. అటు గ్రేడ్ సిలో తెలుగు క్రికెటర్లు తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డితో పాటు సంజూ శాంసన్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, రింకూ సింగ్ వంటి యువ ఆటగాళ్లకు చోటు లభించింది. అయి తే మహ్మద్ షమీ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టులో చోటు కోల్పోయాడు. ఇదిలా ఉంటే గతంలో గ్రేడ్ ఏ ప్లస్ కు బీసీసీఐ రూ. 7 కోట్లు చెల్లించేది, గ్రేడ్ ఏకు 5 కోట్లు, గ్రేడ్ బికు రూ.3 కోట్లు, గ్రేడ్ సికు రూ.1 కోటి రూపాయలు పారితోషకంగా అందేది.  ప్ర స్తుత జాబితాకు సంబంధించి పారితోషకం వివరాలు వెల్లడించలేదు.

గ్రేడ్ A ఆటగాళ్లు 

శుభ్మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా

గ్రేడ్ B ఆటగాళ్లు

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్,  హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, యశస్వీ జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్

గ్రేడ్ C ఆటగాళ్లు 

అక్షర్ పటేల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, సంజూ శాంసన్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, ధృవ్ జురెల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, నితీశ్ రెడ్డి, అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్, రవి బిష్ణోయ్