చెల్లినీ వదల్లేదు!

30-04-2024 01:22:46 AM

సోదరి వరుస మహిళపై రేవణ్ణ లైంగికదాడి!

ఆమెపై రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ పైశాచికం

ప్రజ్వల్‌కు చెందిన 3 వేల సెక్స్ వీడియోలు లీక్

మహిళలను లైంగికంగా వేధిస్తూ వీడియో చిత్రీకరణ 

ప్రజ్వల్ సెక్స్ స్కాండల్‌లో విస్తుపోయే నిజాలు
సోదరి వరుస మహిళపై రేవణ్న లైంగికదాడి!
ఆమెపై రేవణ్న కుమారుడు ప్రజ్వల్ పైశాచికం
బాధితురాలు ప్రజ్వల్ భార్యకు సొంత మేనత్త బిడ్డ
ప్రజ్వల్‌కు చెందిన 3 వేల సెక్స్ వీడియోలు లీక్
మహిళలను లైంగికంగా వేధిస్తూ వీడియో చిత్రీకరణ 
వివాదానికి దూరం జరుగుతున్న జేడీఎస్, బీజేపీ


కన్నడ రాష్ట్రంలోనే పెద్ద పేరున్న రాజకీయ కుటుంబం.. దేశంలో మంచి గుర్తింపు పొందిన నేతలున్న కుటుంబం.. ఒకరు దేశ  ప్రధానిగా పనిచేశారు. మరొకరు రెండుసార్లు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరొకరు ఏకంగా ఐదుసార్లు రాష్ట్ర మంత్రిగా రాజకీయం వెలగబెట్టారు. కానీ, ఆ కుటుంబంలో కొందరి బుద్ధి గడ్డి తిన్నది. నైతిక విలువలు గాలికొదిలారు. సాయం కోసం చేతులుచాచి వచ్చే మహిళలను వంకరచూపులు చూశారు.  అధికారాన్ని, పదవులను అడ్డుపెట్టుకొని అరాచకాలకు  పాల్పడ్డారు. చివరకు సోదరి వరుస అయినవాళ్లను కూడా వదలలేదు. పదులు, వందలు కాదు.. ఏకంగా మూడు వేల లైంగికదాడులకు సంబంధించిన వీడియోలు బయటపడ్డాయి. 

మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడైన మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడైన ఎంపీ ప్రజ్వల్ కలిసి మహిళలను లైంగికంగా వేధించినట్లున్న మూడు వేల వీడియోలు వెలుగు లోకి వచ్చాయి. రేవణ్ణ భార్య భవానీ రేవణ్ణకు స్వయానా మేనత్త  కూతురుపై కూడా లైంగికదాడికి పాల్పడ్డారు. ఆమె రేవణ్ణకు వరుసకు సోదరి అవటం గమనార్హం. బాధితురాలు రేవణ్ణ ఇంట్లో పనిమనిషి. ఎన్నికల సమయం కావటంతో ఈ కుంభకోణానికి దూరం జరిగేందుకు అటు జేడీఎస్, ఇటు దాని మిత్రపక్షమైన బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. ఇది కుటుంబ వ్యవహారం కాదని, రేవణ్ణ కుటుంబం తమతో కలిసి ఉండటం లేదని ఆయన సోదరుడు, మాజీ సీఎం కుమారస్వామి తెలిపారు. సెక్స్ కుంభకోణంపై జేడీఎస్ నేతలే స్పందిస్తారని బీజేపీ తప్పించుకొన్నది. 


బెంగళూరు, ఏప్రిల్ 29: కర్ణాటకలోని ప్రధాన పార్టీలకు సార్వత్రిక ఎన్నికలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారిన వేళ మాజీ ప్రధాని, జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడ మనుమడు ప్రజ్వల్ రేవణ్న సెక్స్ కుంభకోణం సంచలనం సృష్టిస్తున్నది. మహిళలపై ఆయన లైంగికదాడికి పాల్పడుతున్న వీడియోలు హసన్ జిల్లాలో వైరల్‌గా మారాయి. దీంతో ఆయనపై కేసు నమోదైంది. మరోవైపు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిన సమయంలో ప్రజ్వల్ రేవణ్న దేశం విడిచి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది.

సిట్ ఏర్పాటు..
33 ఏళ్ల ప్రజ్వల్ రేవణ్నకు సంబంధించిన వీడియోలు ఏప్రిల్ 26న రెండో విడత ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు తర్వాత సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అయితే ఈ ఆరోపణలను ప్రజ్వల్ రేవణ్ణ ఖండించారు. ప్రచారంలో ఉన్న వీడియోలు అన్నీ కల్పితాలు అని ఫిర్యాదు చేశారు. అశ్లీల వీడియోల కేసును విచారించేందుకు కర్ణాటక ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. దీనిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ సిఫారసు చేయడంతో సిద్ధరామయ్య ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది.

ప్రజ్వల్ రేవణ్నపై ఆరోపణలు ఏంటి?
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన అశ్లీల వీడియోలు ప్రజ్వల్ రేవణ్న చిత్రీకరించనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వీడియోలు బయటకు వచ్చిన కొన్ని గంటల్లోనే ఓ మహిళ ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి ఇంట్లో పనిచేస్తున్న సమయంలో 2019 నుంచి 2022 మధ్య కాలంలో తాను పలుమార్లు లైంగిక వేధింపులకు గురయ్యానని ఆరోపించింది. అలాగే ప్రజ్వల్ తన కుమార్తెకు సైతం వీడియో కాల్ చేసి అసభ్యంగా ప్రవర్తించేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజ్వల్ తండ్రి, ప్రస్తుత హోలేనర్సిపుర నియోజకవర్గ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్న కూడా తన భార్య ఇంట్లో లేని సమయంలో తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించింది. వారితో తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తంచేసింది. 

ప్రతిష్టతను దెబ్బతీయడానికే..
వీడియోలు ఆన్‌లైన్‌లో వెలువడిన కొద్ది గంటల్లోనే రేవణ్న శనివారం ఉదయం జర్మనీకి పారిపోయాడు. వీడియోలు కల్పితాలని, తన ప్రతిష్టను దెబ్బతీయడానికే వాటిని ప్రచారం చేస్తున్నారని అంతకుముందు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

అది రేవణ్న సొంత సమస్య
వివాదంపై ప్రజ్వల్ రేవణ్న చిన్నాన్న కుమారస్వామి స్పందించారు. ఈ వివాదంలో వాస్తవాలు వెల్లడయ్యే వరకు వేచి చూస్తామని తెలిపారు. అయితే నేరం చేసిన వారిని క్షమించే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు. ఇది దేవెగౌడ కుటుంబ సమస్య కాదని, రేవణ్న కుటుంబ సమస్య మాత్రమేనని పేర్కొన్నారు. మంగళవారం జేడీఎస్ కోర్ కమిటీ సమావేశమై ప్రజ్వల్‌ను పార్టీనుంచి బహిష్కరిస్తుందని వెల్లడించారు. ప్రజ్వల్ రేవణ్న దేశం విడిచి పారిపోవడానికి బీజేపీ సహాయం చేసిందని కాంగ్రెస్ విరుచుకుపడింది. ప్రజ్వల్‌ను అరెస్ట్ చేయాలని డిమాం డ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బెంగళూరులో నిరసనకు దిగారు.

అవి పాత వీడియోలు:రేవణ్ణ
వైరల్ అవుతున్న తన కుమారుడి వీడియోలు నాలుగైదేండ్ల కిందటివని హెచ్‌డీ రేవణ్న చెప్పారు. పాత వీడియోలతో ఎన్నికల వేళ రాజకీయం చేస్తున్నారని ఆరోపించా రు. తన కుమారుడు ఎక్కడికీ పారిపోలేదని, కేసులను ఎదుర్కొంటాడని స్పష్టం చేశారు. తనపై నమోదైన కేసు విషయంలో ఇప్పుడేమీ మాట్లాడబోనని చెప్పారు. 

జేడీఎస్‌తో పొత్తు మాకే నష్టం: బీజేపీ

2023 అసెంబ్లీ ఎన్నికల్లో హొళెనరాసిపుర అభ్యర్థిగా ఉన్న బీజేపీ నాయకుడు దేవరాజే గౌడ.. ప్రజ్వల్ రేవణ్ణతో పాటు దేవెగౌడ కుటుంబంపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్రకు గత ఏడాది డిసెంబర్‌లోనే లేఖ రాశానని సోమవారం తెలిపారు. ప్రజ్వల్ రేవణ్ణ మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న 2,976 వీడియోలతో కూడిన పెన్ డ్రైవ్ తనకు గతంలోనే అందిందని చెప్పారు. తమ పార్టీ జేడీఎస్‌తో పొత్తు పెట్టుకొని హసన్‌లో ప్రజ్వల్‌ను అభ్యర్థిగా బరిలో దించ డం పార్టీ ప్రతిష్టకు పెద్దదెబ్బగా మారిందని పేర్కొన్నారు. ఈ వివాదం నుంచి దూరం జరిగేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. ప్రభుత్వం ప్రకటించిన సిట్ విచార ణపై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్ ప్రకాశ్ వెల్లడించారు. దీనిపై జేడీఎస్ నేతలనే అడగాలని బీజేపీ కర్ణాటకశాఖ అధ్యక్షుడు మీడియాకు సూచించారు. 

అమిత్‌షాకు ముందే తెలుసు

2023 డిసెంబర్‌లో హొళెనరాసిపుర అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి దేవరాజే గౌడ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్రకు లేఖ రాస్తూ.. హసన్ ఎంపీ (ప్రజ్వల్)కు సంబంధించిన 2,976 సెక్స్ వీడియోలతో కూడిన పెన్‌డ్రైవ్ తన వద్ద ఉన్నదని తెలిపారు. ఈ అంశంపై 2024 జనవరిలో ఆయన మీడియా సమావేశం కూడా నిర్వహించి ప్రజలకు వెల్లడించారు. ప్రజ్వల్‌కు మళ్లీ ఎంపీ టికెట్ ఇవ్వొద్దని కోరారు. ఫిబ్రవరి, మార్చిలో ఈ అంశాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఇంత జరిగినా, ప్రజ్వల్ గురించి పూర్తిగా తెలిసినా మళ్లీ అతడికి టికెట్ ఇవ్వటమే కాకుండా.. అతని తరఫున ప్రధాని ప్రచారం చేశారు. ఈ సెక్స్ కుంభకోణం గురించి కర్ణాటక బీజేపీ నేతలందరికీ తెలుసు.. అయినా నోరు మెదపకుండా సైలెంట్‌గా ఉన్నారు.
 ఖర్గే, కర్ణాటక మంత్రి