విపక్షాలకు నాయకుడెవరు?

30-04-2024 01:43:54 AM

కాంగ్రెస్ ఆలోచన దేశానికి ప్రమాదకరం

సంపద విభజనతో విద్వేషాలు పెరుగుతాయి

వారసత్వ పన్ను దేశాన్ని దెబ్బతీస్తుంది

కాంగ్రెస్ ప్రతిపాదనలు మావోయిస్టు దృక్పథానికి నఖలు

టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ 

కర్ణాటకలో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు బీజేపీ చట్టం చేసే,్త దాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసి ముస్లింలకు కేటాయించింది. ముస్లింలందరినీ ఓబీసీల 

జాబితాలో చేర్చింది. ఇప్పుడు తెలంగాణలోనూ దీన్ని అమలు చేయాలని కాంగ్రెస్ చూస్తోంది.

 ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాలకు నాయకుడు ఎవరని ప్రధాని నరేంద్రమోదీ ప్రశ్నించారు. ఇండియా కూటమికి కూడా నాయకుడంటూ ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ ఎవరికి వారే అన్నట్టుగా ఉన్నాయని విమర్శించారు. సోమవారం టైమ్స్ ఆఫ్ ఇండియాకు ప్రధాని మోదీ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోపై మరోసారి విరుచుకుపడ్డారు. ‘సంపద పునఃపంపిణీ పేరుతో ప్రభుత్వం మీ డబ్బును తీసుకుంటామంటే మీరు రాత్రిపగలు కష్టపడుతారా? సంపద పన్ను వంటి ఆలోచనలు స్టార్టప్‌లను చంపేస్తాయి. ఇవి కేవలం విపక్షాల ఓటు బ్యాంకును సంతోషపెట్టే పద్ధతులు. ఇలాంటి ఆలోచనలు సమాజంలో సామరస్యాన్ని కోలుకోకుండా దెబ్బతీస్తాయి. ఈ పరిష్కారాలు ఊహల్లో కూడా సాధ్యంకావు. మనం నిజంగా పేదల ఎదుగుదల కోసం కృషి చేయాలంటే.. వారికి ఉన్న అడ్డంకులను తొలగించి సాధికారత కల్పించాలి. ఇలా చేస్తే దేశంలో వ్యవస్థాపక సామర్థ్యం పెరగడంతో పాటు స్టార్టప్‌లు, గొప్ప క్రీడాకారులు దొరుకుతారు. పేదరికాన్ని నిర్మూలించడంలో సంపద పునఃపంపిణీ, ఆస్తి పన్ను గతంలో ఎప్పుడూ విజయవంతం కాలేదు. ఇది పేదలను సమాన స్థాయిలో ఉండేలా మాత్రమే చేసింది’ అని తెలిపారు.       

కాంగ్రెస్‌ది కుటిల ఆలోచన 

కాంగ్రెస్ ఆలోచనలతో ప్రజలు పేదరికంలోనే మగ్గిపోతారని, సంపద సృష్టి ఆగిపోతుందని మోదీ విమర్శించారు. దేశంలో పేదరికాన్ని ఏకరీతిగా మారుస్తాయని తెలిపారు. ఫలితంగా దేశంలో అసహనం పెరుగుతుందని, సమానత్వాన్ని పెంపొందించే ప్రతిమార్గాన్ని అడ్డుకుంటాయని చెప్పారు. ఇవి ప్రజల్లో ద్వేషాన్ని సృష్టిస్తాయని, ఆర్థిక, సామాజిక అస్థిరతను పెంచుతాయని మోదీ అన్నారు. కాంగ్రెస్ ప్రతిపాదిస్తున్న సంపద పునర్విజనను ప్రస్తావిస్తూ ఆ పార్టీ నేత సామ్ పిట్రోడా కొత్త చర్చకు తెరదీశారు. అమెరికాలో వారసత్వ పన్ను ఉంది. 100 మిలియన్ డాలర్ల ఆస్తి ఉన్న వ్యక్తి మరణిస్తే అతని పిల్లలకు 45 శాతం మాత్రమే దక్కుతుంది. మిగితా 55 శాతం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అని చెప్పారు. ఇలాంటి వారసత్వపు పన్నును విధించాలన్న ఆలోచనను చాలా క్రూరమైనదని మోదీ మండిపడ్డారు. ఇది మన దేశాన్ని కోలుకోకుండా దెబ్బతీస్తుందని, దీన్ని భారత్‌కు నిజమైన ప్రమాదంగా పరిగణించాలని సూచించారు. 

ఇంటింటిపై దాడి చేస్తారా..?

సామాజిక, ఆర్థిక సర్వే ద్వారా దేశాన్ని ఎక్స్‌రే తీసి ఆస్తుల పునర్విభజన చేస్తామన్న కాంగ్రెస్ ప్రతిపాదన మావోయిస్టు భావజాలాన్ని ప్రతిబింబిస్తుందని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ, దాని యువరాజు సూచించిన పరిష్కారాలు మావోయిస్టు దృక్పథంతో ఏకీభవిస్తున్నాయి. ఇది చాలా బాధాకరం. యువరాజు చెప్పిన ఎక్స్‌రే అంటే ప్రతి ఇంటిపై దాడి చేయడమే. ఎంత భూమి ఉందోనని రైతులపై దాడి చేస్తారు. కష్టపడి సంపాదించి కూడబెట్టిన ఆస్తి ఎంత ఉందని సామాన్య పౌరుడిని సోదా చేస్తారు. మహిళల ఆభరణాలను లెక్కించి స్వాధీనం చేసుకుంటారు. అన్ని మైనారిటీల ఆస్తులకు మన రాజ్యాంగం కల్పిస్తుంది. అంటే కాంగ్రెస్ మాట్లాడే సంపద పునర్విభజన మైనారిటీలకు వర్తించదు. వారిని కాంగ్రెస్ ముట్టుకోదు. వక్ఫ్ బోర్డు ఆస్తులను పంపిణీ కోసం కాంగ్రెస్ పరిగణించదు. కానీ ఇతర సామాజిక వర్గాల ఆస్తులపై కన్నేస్తుంది. ఇది పూర్తిగా మతపరమైన సామరస్యాన్ని దెబ్బతీస్తుంది అని వివరించారు. 

వాళ్లు అధికారంలోకి రాకపోతే  ప్రజాస్వామ్యం లేనట్లా..?

దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతోందని, ఎన్నికల నిరంకుశత్వం దిశగా భారత్ పయనిస్తోందన్న విపక్షాల విమర్శలపై మోదీ స్పందించారు. ప్రతిపక్షాలు అధికారంలోకి రాలేకపోతున్నాయని, అందుకే ప్రపంచ వేదికలపై భారత్ పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రధాని ఆరోపించారు. వాళ్లు మన ప్రజలు, ప్రజాస్వామ్యం, సంస్థల గురించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. రాహుల్‌గాంధీ స్వయంచాలకంగా అధికారంలోకి రానంత మాత్రాన దేశంలో ఎన్నికల నిరంకుశత్వం ఏర్పడుతుందా? ఆయన ఎన్నికల్లో పోరాడాల్సి ఉంటుంది. ప్రజలు ఆయనను ఎన్నుకోవడం లేదని భారత్‌ను ప్రజాస్వామిక దేశంగా ప్రచారం చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ, ప్రైవేట్, వ్యవస్థాపక రంగాల్లో అవకాశాలు సృష్టించడం వల్లనే తాను ప్రధానిగా ఎన్నికైన విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు. 

భారత్‌పై గౌరవం పెరుగుతోంది..

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. సంఘర్షణలు జరుగుతున్నాయని, అయినా వాటన్నింటినీ భారత్ తట్టుకుని నిలబడిందని మోదీ అన్నారు. వాటన్నింటినీ పట్టించుకోకుండా తమ పౌరులకు ఇంధన ధరలు నియంత్రణలో ఉండేలా చూసుకోవడం వల్ల భారత్‌ను ప్రపంచదేశాలు గౌరవిస్తున్నాయని తెలిపారు. నేను ఇతర దేశాల అధినేతలను కలిసినప్పుడు వాళ్లకు భారత్‌పై ఆసక్తి పెరగడం గమనించాను. వాళ్ల దేశంలోని పరిస్థితులతో పోలుస్తూ భారత్ ఆశావాదం, అవకాశాలు నిండిన దేశంగా గుర్తిస్తున్నారు. భారత్, భారతీయుల పట్ల వాళ్లు నిజమైన గౌరవాన్ని చూపిస్తున్నారు. ప్రపంచంలో భారత్‌కు ప్రాధాన్యం ఎన్నడూ లేనంతగా పెరిగింది అని ప్రశంసించారు. 

యూసీసీ కోసం అన్ని విధాల కృషి చేస్తాం..

ఎన్నికల ప్రచారంలో బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతోందన్న కాంగ్రెస్ ఆరోపణలను మోదీ తోసిపుచ్చారు. మతప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామని చెబుతూ రాజ్యాంగంతో పాటు చట్టాన్ని కాంగ్రెస్ ఉల్లంఘిస్తోందని మోదీ ఆరోపించారు. కర్ణాటకలో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు బీజేపీ చట్టం చేసే,్త దాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసి ముస్లింలకు కేటాయించిందని తెలిపారు. ముస్లింలందరినీ ఓబీసీల జాబితాలో చేర్చిందన్నారు. ఇప్పుడు తెలంగాణలోనూ దీన్ని అమలు చేయాలని కాంగ్రెస్ చూస్తోందని ఆరోపించారు. వాళ్లు అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజ్వరేషన్లు తగ్గించి మైనారిటీలకు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు ఈ నిర్ణయాలు రుజువు చేస్తున్నాయని మోదీ వివరించారు. 2006లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రసంగాన్ని ఉటంకిస్తూ.. ఈ దేశంలోని వనరులపై తొలి హక్కు మైనారిటీలకే ఉందని చెప్పిన పార్టీ నుంచి ఇంతకంటే ఏం ఆశించగలమని విమర్శించారు. బీజేపీ ప్రధాన అజెండాల్లో యూనిఫాం సివిల్ కోడ్ ఒకటని మోదీ పునరుద్ఘాటించారు. యూసీసీని అమలు చేసేందుకు మా శక్తి మేరకు అన్ని విధాల కృషి చేస్తామని స్పష్టం చేశారు. 

కేజ్రీవాల్ అరెస్టుపై..

కాగా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపైనా మోదీ స్పందించారు. ఆయన అరెస్టు ఇతర నేతలకు ఒక ఉదాహరణగా ఉంటుందని తాను భావించడం లేదన్నారు. మిగిలిన రాజకీయ నేతల్లో నైతికత లోపించి ఆ స్థాయికి దిగజారుతారని అనుకోవట్లేదన్నారు. ప్రతిపక్షాలను వేధించేందుకు దర్యాప్తు సంస్థలను కేంద్రం ప్రయోగిస్తోందన్న విపక్షాల ఆరోపణలను మోదీ కొట్టిపారేశారు. దర్యాప్తు సంస్థలు నమోదు చేసిన కేసుల్లో తక్కువ శాతం మాత్రమే రాజకీయ నేతలకు సంబంధించినవని గుర్తు చేశారు. ఈడీ విచారించిన కేసుల్లో 3 శాతం మాత్రమే రాజకీయ నాయకులకు సంబంధించినవి. మిగిలిన 97 శాతం అధికారులు, నేరస్థులకు చెందినవి. వారిపైనా ఆ సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి. సీబీఐ కేసుల్లోనూ 1 నుంచి 1.5 శాతం మాత్రమే రాజకీయ నాయకులకు చెందనవి అని మోదీ వివరించారు.