20 April, 2026 | 3:14 AM

బాబ్ అల్ మాండెబ్ జలసంధిని మూసేస్తాం

20-04-2026 01:27 AM

హౌతీల హెచ్చరిక 

సనా/ఏడెన్, ఏప్రిల్ 19: ప్రపంచ శాంతికి విఘాతం కలిగే చర్యలను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కొనసాగిస్తే తాము బాబ్ అల్ మాండెబ్ జలసంధిని మూసేస్తామని యెమెన్‌లోని హౌతీలు హెచ్చరించా రు. ఒక్కసారి దానిని మూసేస్తే.. తిరిగి తెరిపించడం ప్రపంచంలోని ఏ ఒక్కరికీ సాధ్యం కాదని హౌతీప్రభుత్వ విదేశాంగశాఖ మంత్రి హుస్సేన్ పేర్కొన్నారు. ప్రపంచ శాంతికి ఆటంకం కలిగించే అన్ని చర్యలను ట్రంప్ ఆపేయాలని, ఈ విధ్వంసం నుంచి వెనక్కి మళ్లాలని అమెరికాకు సహకరించే దేశాలకు హౌతీలు సూచించారు.

అదే అందరికీ శ్రేయస్కరమన్నారు. బాబ్‌అల్‌మాండెబ్‌జలసంధి చాలా కీలక ప్రాముఖ్యత గలది. చమురు, ఎల్‌ఎన్జీ, ధాన్యాలు, ఎరువులు వంటి కీలక వస్తువుల రవాణాలో ఈ మార్గం కీలకపాత్ర పోషిస్తుంది. బాబ్ అల్ మాండెబ్ యెమెన్- జిబౌటి మధ్య విస్తరించి ఉంది. ఇది ఎర్రసముద్రాన్ని అరేబియా సముద్రంతో అనుసంధానించే కీలక మార్గం. ఈ జలసంధి ద్వారా నూయజ్ కెనాల్‌కు వెళ్లే నౌకలు ప్రయాణిస్తాయి. అందువల్ల ఇది యూరప్- మధ్య వాణిజ్యానికి అత్యంత కీలకంగా మారింది. ఈ జలసంధి గ్లోబల్ ట్రేడ్‌లో ఒక ప్రధాన గేట్‌వేగా పనిచేస్తోంది.

రోజుకు సుమారు 45 లక్షల బ్యారెళ్ల చమురు ఈ మార్గం ద్వారా రవాణా అవుతోంది. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 10- శాతం సరకు -ఎల్‌ఎన్జీ, ఆహార పదార్థాలు, తయారీ ఉత్పత్తులు- ఈ మార్గం గుండా ప్రయాణిస్తాయి. సంవత్సరానికి లక్షల కోట్ల విలువైన వస్తువులు ఈ జలమార్గంపై ఆధారపడుతున్నాయి. సుమారు 30 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉండటం వ ల్ల వ్యూహాత్మకంగా ఇది అత్యంత సున్నితమైన ప్రాంతంగా పరిగణించబడుతోంది. 

బాబ్ అల్ మాండెబ్ అంటే ఏమిటి?

అరేబియా ద్వీపకల్పానికి పశ్చిమాన ఉన్న ఎర్ర సముద్రాన్ని అరేబియా సముద్రంతో అనుసంధానించే కీలక మార్గం. అరబిక్‌లో ‘బాబ్ అల్ మాండెబ్’ అంటే ‘కన్నీటి ద్వారం’ లేదా ‘విషాద ద్వారం’ అని అర్థం. గతంలో ఇక్కడ ప్రతికూల పరిస్థితుల వల్ల అనేక నౌకలు ప్రమాదాలకు గురికావడంతో ఈ పేరు ఏర్పడింది. 1869లో సూయజ్ కాలువ ప్రారంభమైన తర్వాత ఈ మార్గానికి మరింత ప్రాధాన్యం పెరిగింది.