10 July, 2026 | 9:03 PM

ఉపాధ్యాయులు లేక అటెండర్‌తోనే పాఠాలు..!

10-07-2026 07:47 PM

అంతర్ని ప్రభుత్వ పాఠశాలలో చిన్నారుల చదువులకు గండి

కుభీర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కుభీర్ మండలం అంతర్ని గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని తెలుస్తోంది. పాఠశాలలో ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంతో అటెండర్‌నే విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న పరిస్థితి నెలకొంది. చిన్నారుల విద్యాభవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం విద్యా ప్రమాణాల మెరుగుదలపై దృష్టి సారిస్తున్నామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే పూర్తి స్థాయి ఉపాధ్యాయులను నియమించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులను కోరుతున్నారు. “బడిలో గురువు ఉండాలి… అటెండర్ కాదు” అంటూ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.