కోలిండియా స్థాయి పోటీల్లో రాణించాలి
మందమర్రి,(విజయక్రాంతి): సింగరేణి కార్మిక క్రీడాకారులు ఏరియా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి కోలిండియా స్థాయి పోటీలకు ఎంపికై పతకాలు సాధించి సింగరేణి కీర్తినీ కోల్ ఇండియాలో చాటాలని ఏరియా ఎస్ఓటూ జిఎం విజయ ప్రసాద్ కోరారు. ఏరియా లోని సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ లో మంగళవారం వర్క్ పీపుల్ స్పోర్ట్స్& గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 61 వ వార్షిక క్రీడోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కబడ్డీ పోటీలను ప్రారంబించి మాట్లాడారు.
సింగరేణి కార్మిక క్రీడాకారులు, కళాకారులు కోల్ ఇండియా స్థాయి పోటీలలో రాణించి ప్రతి సంవత్సరం అనేక బహుమతులు సాధిస్తున్నారన్నారు. ఏరియా క్రీడాకారులు కోల్ ఇండియా పోటీలకు ఎంపికై పతకాలు సాధించి సింగరేణికి, ఏరియా కు పేరు ప్రఖ్యాతలు తీసుకు రావాలని కోరారు. సీనియర్ క్రీడాకారులు సంస్థలో పనిచేస్తున్న యువ ఉద్యోగులను క్రీడల వైపు ప్రోత్సహించాలన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దృఢత్వానికి ఉపయోగ పడతాయని, సింగరేణి6 యాజమాన్యం కార్మిక క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉత్తమ క్రీడాకారులుగా రాణించాలన్నారు.
కబడ్డీ విజేత గ్రూప్ 3..
ఏరియా స్థాయి కబడ్డీ పోటీల్లో 3 గ్రూపులు తలపడగా గ్రూప్ 3 జట్టు విజయం సాధించింది. కాసిపేట1,శాంతి ఖని గనుల క్రీడాకారులు గ్రూప్ 1 జట్టు గా, కేకే-5, కేకే ఓసి, ఆర్కే ఓసి జిఎం ఆఫీస్ క్రీడాకారులు గ్రూప్ 2 జట్టుగా, కాసిపేట 2, ఎస్అండ్ పిసి, ఆర్కేపి సివిల్, ఏరియా స్టోర్స్, సిహెచ్పి, సివిల్ క్రీడాకారులు గ్రూప్ 3 జట్టుగా పోటీ పడ్డారు. హోరా హోరిగా సాగిన పోటీల్లో గ్రూప్ 3 జట్టు విజేతగా నిలువగా, గ్రూప్ 1 జట్టు రన్నర్స్ గా నిలిచింది.






