16-09-2025 05:28:09 PM
వనపర్తి,(విజయక్రాంతి): గతేడాది వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులు, భవనాల మరమ్మతుల కోసం మంజూరైన ఎస్డిఆర్ఎఫ్ నిధుల వినియోగానికి సంబంధించి వేగంగా యూసీలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ ఎస్ డి ఆర్ ఎఫ్ నిధుల వినియోగానికి సంబంధించిన అంశంపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గతేడాది వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులు, భవనాల మరమ్మతుల కోసం మంజూరైన నిధుల వినియోగానికి సంబంధించి వేగంగా యూసీలు సమర్పించాలని ఆదేశించారు.
పనులు పూర్తిచేసి యూసీలు సమర్పించడంలో నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. అదేవిధంగా, కొత్త మరమ్మతు పనులకు సంబంధించి ప్రతిపాదనలు ఫోటోతో సహా పంపించాలని తెలియజేశారు. అధికారులు తమ పరిధిలోని మరమ్మత్తు పనులకు సంబంధించిన ప్రతిపాదనలు డి సెక్షన్ ద్వారా ఎంత త్వరగా ఇస్తే అంత త్వరగా పనులు మంజూరు అవుతాయని తెలిపారు. తద్వారా పనులు కూడా వేగంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని సూచించారు. ఈ వారంలోగా ప్రతిపాదనలు పంపించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అధికారులు పంపించే ప్రతిపాదనలకు సంబంధించి రిపేర్ వర్క్స్ యొక్క ఫోటోలు తప్పనిసరిగా సమర్పించాలన్నారు.