5 April, 2026 | 6:04 AM

ఉద్యోగులను సాగనంపుడే!

05-04-2026 01:44 AM

ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ నుంచి డిప్యూటేషన్

  1. ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకుని.. జాబితా సిద్ధం చేయాలంటూ ఎండీ ఆదేశాలు
  2. ప్రైవేటీకరణకు అడుగులు పడుతున్నాయని ముందేచెప్పిన ‘విజయక్రాంతి’..
  3. మార్చి 15న ప్రచురితమైన ‘ఆర్టీసీలో భయం.. భయం.. కొత్త కొలువులకు హాల్ట్’ కథనం
  4. ఈవీ బస్సుల రాకతో ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు తరలింపు
  5. ప్రైవేటు కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులతోనే ఈవీ బస్సుల నిర్వహణ

హైదరాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): అంతా అనుకున్నట్టుగానే జరు గుతోంది.. ఆర్టీసీని ప్రైవేటీకరించడానికి ప్రభుత్వం ఒక్కో అడుగు వేస్తున్నది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలోని ఆర్టీసీ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నా రని, వారి నుంచి ఆప్షన్స్ తీసుకుని ఇతర జోన్లకు డిప్యూటేషన్‌పై పంపించేందుకు జాబితా సిద్ధం చేయాలంటూ ఆర్టీసీ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (వీసీఎండీ) అంతర్గత ఆదేశాలు జారీచేశారు.

దీంతో గ్రేటర్ పరిధిలోని ఆర్టీసీ కార్మికుల్లో భయాందోళనలు మొదలయ్యా యి. ఇదే దారిలో.. భవిష్యత్తులో తమ ఉద్యోగాలు కూడా ఊడుతాయని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇతర ఆర్టీసీ కార్మికుల్లో ఆందోళన మొదలైంది. ఆర్టీసీ ప్రైవేటీకరణకు ప్రభుత్వం క్రమంగా చర్యలు తీసు కుంటున్నదని.. ఉద్యోగులను ఇతర స్థానాలకు పంపించడం ఖాయమని చెబుతూ ‘విజయక్రాంతి’ దినపత్రిక ముందే చెప్పిం ది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితం ఎలా ఉండనుందనేది ముందుగా ‘విజయక్రాంతి’ పత్రికలో పలు కథనాల ద్వారా చెప్పినట్టుగానే.. ఇప్పుడు జరుగుతుండటం గమనార్హం.

ఈవీ బస్సుల నిర్వహణ పేరుతో..

రాష్ట్రవ్యాప్తంగా సంప్రదాయ డీజిల్ బస్సుల స్థానాలో.. పర్యావరణ హితానికి, కర్బన ఉద్గారాలను తగ్గించే క్రమంలో ఎలక్ట్రికల్ (ఈవీ) బస్సులను విడతల వారీగా ఆర్టీసీలో ప్రవేశపెట్టేందుకు ప్రభు త్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే 500 ఈవీ బస్సులను ఆర్టీసీలో ప్రవేశపెట్టారు. మరికొద్ది నెలల్లో మరికొన్ని ఈవీ బస్సులను ప్రవేశపెట్టనున్నా రు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1న ఆర్టీసీ ఎండీ నుంచి గ్రేటర్ హైదరాబాద్ జోన్ (జీహెచ్‌జడ్) ఈడీకి అంతర్గత ఉత్తర్వులు జారీఅయ్యాయి.

ఇందులో విడతలుగా ఈవీ బస్సులను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో జీహెచ్‌జడ్ పరిధిలో ఉన్న ఆర్టీసీ కార్మికులు (డ్రైవర్లు, మెకానిక్‌లు, హెల్పర్లు, శ్రామిక్‌లు) అవసరానికి మించి ఉన్నట్టుగా ఆర్టీసీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో జీహెచ్‌జడ్ పరిధిలోని డ్రైవ ర్లు, మెకానిక్‌లు, హెల్పర్లు, శ్రామిక్‌లు కరీంనగర్, హైదరాబాద్ జోన్లలోని ఇతర రీజియన్లలో పనిచేయడానికి, అలాగే ప్రస్తుతం చేస్తున్న పని విధానాన్ని మార్చివేసి.. కండక్టర్లుగా పనిచేసే అవకాశం ఉన్నవారిని గుర్తించేందుకు వీలు గా.. వారి వారి ఆప్షన్లను తీసుకుని జాబితా సిద్ధంచేసి ఈనెల 15 తారీఖులోగా హెడ్ క్వార్టర్‌కు పంపించాలని ఎండీ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 500 వరకు ఈవీ బస్సులను ప్రవేశపెట్టారు. ఇందు లో అత్యధికంగా గ్రేటర్ పరిధిలో సేవలు అం దిస్తున్నాయి. అయితే ఈ బస్సుల నిర్వహణకు ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలే ఔట్ సోర్సింగ్ ద్వారా డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, సూపర్‌వైజర్లు, అధికారులను నియమించుకున్నా యి. అయితే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచితంంగా ప్రయాణించే సేవలు అందిస్తున్న కొన్ని ఈవీ బస్సుల్లో మాత్రమే ఆర్టీసీ కండక్టర్లు మాత్రమే పనిచేస్తున్నారు.

డ్రైవర్లు, సూపర్‌వైజర్లు, అధికారులు సదరు కార్పొరేట్ సంస్థే చూసుకుంటోంది. ఇక మిగిలిన ఈవీ బస్సులన్నీ ప్రైవేటు సంస్థే నిర్వహి స్తోంది. మరికొద్ది నెలల్లో గ్రేటర్ పరిధిలో మరో 2 వేల వరకు ఈవీ బస్సులను ప్రవేశపెట్టేలా కసరత్తు వేగంగా జరుగుతోంది. అవన్నీ కూడా ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు నియమించుకున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బందితోనే నిర్వహిస్తారన్నమాట. 

ఈనేపథ్యంలోనే గ్రేటర్ పరిధి లోని ఆర్టీసీ ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు డిప్యూటేషన్‌పై వెళ్ళేలా అప్షన్లతో జాబితాను తయారు చేయాలంటూ ఆర్టీసీ ఎండీ ఉత్తర్వు లు జారీచేశారంటూ.. కార్మిక సంఘాలుకూడా భగ్గుమంటున్నాయి. ఆర్టీసీ ప్రైవేటీకరణ కుట్రను ముందుగానే ఊహించి, హెచ్చరించిన ‘విజయక్రాంతి’ కథనాలను కార్మికులు ఉదహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్మికులు సమ్మెబాట పట్టే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి.

ఈవీ బస్సుల రాకతోనే..

నిజానికి ఈవీ బస్సులను ఆర్టీసీ కార్మికులుకూడా స్వాగతిస్తున్నారు. అయితే ప్రైవే టు కార్పొరేట్ సంస్థలకు లాభం కలిగేలా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో.. ఆర్టీసీ మనుగడకు ప్రమాదం పొంచి ఉంద ని ‘విజయక్రాంతి’ ముందే హెచ్చరించింది. కేంద్రం నుంచి ఒక్కో ఎలక్ట్రికల్ బస్సుకు రూ.36 లక్షల గ్రాంట్‌ను తీసుకుంటున్న ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు.. అవే బస్సుల ను ఆర్టీసీకి అద్దెకు ఇస్తుండటం గమనార్హం.

పైగా అద్దెకు ఇస్తున్న ఈవీ బస్సులను నిర్వహించడానికి డ్రైవర్లు, కండక్టర్లు, మెకాని క్‌లు, సూపర్‌వైజర్లు, అధికారులను సదరు ప్రైవేటు కార్పొరేట్ సంస్థనే ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించుకుని ఈవీ బస్సుల ను నిర్వహిస్తున్నారు. దీనితో ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులకు పని లేదని ఇతర ప్రాంతాలకు, ఇతర పనుల్లోకి డిప్యూటేషన్‌పై పంపిస్తారని ‘విజయక్రాంతి’ ప్రచురించిన కథనంలో ఏం జరగబోతుందనేది స్పష్టంగా వివరించింది.

ఉద్యోగులకు ఎదురయ్యే ప్రమాదంపై ముందుగానే హెచ్చరించింది. అనుకున్నట్టుగానే తాజాగా ఆర్టీసీ ఎండీ నుంచి జారీ అయిన ఆదేశాల్లో ఈవీ బస్సులను విడతలుగా ప్రవేశపెడుతున్నట్టు, ఆర్టీసీలో అవస రానికి మించి సిబ్బంది ఉన్నారనే కారణాలుగా చూపెడుతూ డిప్యూటేషన్‌పై ఆప్షన్లు అడగటం గమనార్హం.

ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లోనే..

గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో సుమారు 13 వేల మంది ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు ఉన్నారు. భవిష్యత్తులో కొత్తగా వచ్చే ఈవీ బస్సులను ఎక్కువ శాతం గ్రేటర్ పరిధిలోనే ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అంటే.. సిటీ పరిధిలో ఉండే కార్మికులు, ఉద్యోగులే మొదటగా ప్రభావంగా అవుతారని, ఇతర ప్రాంతాల్లో పనిచేసేలా యాజమాన్యం ఒత్తిడి తీసుకొస్తుందని మార్చి 15న ప్రచురించిన‘విజయక్రాంతి’ కథనంలో స్పష్టంగా వివరించింది.

ప్రైవేటు ఈవీ బస్సుల నిర్వహణకు ప్రైవేటు కార్పొరేట్ సంస్థలే ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగులు, కార్మికులను రిక్రూట్ చేసుకుంటున్న నేపథ్యంలో.. ఇక్కడ ఉండే ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు సుదూర ప్రాంతాలకు వెళ్ళకతప్పని పరిస్థితిని కల్పించి.. మెల్లమెల్లగా.. గ్రేటర్ పరిధిలోని డిపోలను ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పేలా తెరవెనుక కుట్ర జరుగుతుందని ‘విజయక్రాంతి’ కథనంలో పేర్కొంది.

పత్రికలో వచ్చిన కథనంలో వివరించినట్టుగానే.. తాజాగా ఆర్టీసీ ఎండీ నుంచి వచ్చిన ఆదేశాల్లో.. ఈవీ బస్సులను విడతులుగా ప్రవేశపెడుతున్నామని, అందులో భాగంగానే అవసరానికి మించి ఉన్న కార్మికులు, ఉద్యోగులను ఇతర రీజియన్లలో డిప్యూటేషన్‌పై పనిచేయడానికి వీలుగా వారి నుంచి ఆప్షన్లు తీసుకోవాలంటూ ఆదేశించడం గమనార్హం.

ముందే చెప్పిన ‘విజయక్రాంతి’..

రాష్ట్రంలోని ఆర్టీసీని ప్రైవేటీకరించడానికి అంతర్గతంగా కుట్రపూరితంగా ప్రణా ళికలు రచించి అమలుచేస్తున్నారని ముం దుగానే ‘విజయక్రాంతి’ దినపత్రిక హెచ్చరించింది. ప్రైవేటీకరించడానికి వీలుగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.. వాటి ప్రభావం ఎలా ఉంటుంది.. ఈవీ బస్సుల రాకతో ఉద్యోగులు ఎలాంటి ఇబ్బందుల కు గురవుతారనే కోణంలో పలు కథనాల ను ‘విజయక్రాంతి’ ప్రచురించింది. అలాగే ‘.. ఆర్టీసీలో భయం భయం.. కొత్త కొలువులకు హాల్ట్’ అనే కథనాన్ని ‘విజయ క్రాంతి’ మార్చి 15న ప్రచురించింది.

ఇదులో పుష్కర కాలంలో 18 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు తగ్గిపోయారని, అలాగే ఈవీ బస్సుల ను ప్రవేశపెడుతున్న ప్రభుత్వం.. ప్రైవేటు కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి ఆర్టీసీని పంపించేలా చర్యలు తీసుకుంటుందని వివరించింది. సాధారణంగా.. ఒక కొత్త బస్సు ఆర్టీసీలోకి వస్తే.. సుమారు 5 ఉద్యోగాల కల్పనకు అవకా శం ఉంటుంది. అయితే ఒక ఈవీ బస్సు ను ప్రవేశపెడితే.. ఐదు ఉద్యోగాలు పోతున్నాయంటూ.. ఆర్టీసీ కార్మిక సంఘాల అభిప్రాయాలనుకూడా ఈ కథనంలో ఉదహరించింది.

మూడు కేటగిరీలుగా డిప్యూటేషన్లు..

తాజాగా ఎండీ నుంచి అందిన ఆదేశాల్లో.. ఫిబ్రవరి 23న జరిగిన సమావేశంలో జీహెచ్‌జడ్ పరిధిలో స్టాఫ్ పరిస్థితిపై లోతుగా చర్చించామని, ఇందులో భాగంగా అవసరానికి మించి ఉన్న స్టాఫ్‌ను ఇతర రీజియన్లకు డిప్యూటేషన్‌పై పంపించాలని నిర్ణయం తీసుకున్న ట్టు తెలిపారు. ఇందులో వారి వారి ఆప్షన్, అర్హతలను బట్టి మూడు కేటగిరీలుగా డిప్యూటేషన్‌కు అవకాశం ఉందని తెలిపారు. 

* హైదరాబాద్, కరీంనగర్ జోన్ల పరిధిలోని రీజియన్ల వారీగా డిప్యూటేషన్‌పై పనిచేసేందుకు వీలుగా తమ తమ ఆప్షన్లను గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలోని డ్రైవర్లు, మెకానిక్‌లు, హెల్పర్లు, శ్రామిక్‌లు తెలపాలి.

పదో తరగతి, ఆపై చదువు ఉన్న డ్రైవర్లు గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలోని రీజియన్లలో కండక్టర్లుగా పనిచేసేందుకు ఆప్షన్ ఇవ్వా ల్సి ఉంటుంది. జీహెచ్‌జడ్ పరిధిలోని మెకానిక్‌లు.. ఏడీసీలు, బస్ పాస్ కౌంటర్లలో, పార్కింగ్ డ్రైవ ర్లుగా (హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి) ఆన్ డిప్యూటేషన్‌పై పనిచేసేందుకు ఉద్యోగుల ఆప్షన్ తీసుకోవాలి.

ఇలా మూడు కేటగి రీలుగా డిప్యూటేషన్‌పై పనిచేసేందుకు వీలుగా ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకుని ఏప్రిల్ 15 తారీఖులోగా జాబితాలను సిద్ధంచేసి పంపించాలని ఎండీ నుంచి అంతర్గతంగా వచ్చిన ఆదేశాల్లో పేర్కొన్నారు. దీనిని అత్యంత ప్రాధాన్యత అంశంగా పరిగణించాలని (మోస్ట్ అర్జెం ట్) కూడా అందులో పేర్కొనడం గమనార్హం.