02-12-2025 01:12:32 PM
బెంగళూరు: కర్ణాటక రాజకీయం రసవత్తరంగా మారింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మంగళవారం మరోసారి బ్రేక్ భేటీ అయ్యారు. డీకే శివకుమార్ ఆహ్వానం మేరకు అల్పాహార విందుకు వెళ్లిన సిద్ధరామయ్య అల్పాహారం చేశాక పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తమ ఐక్యతను ప్రదర్శిస్తూ ఇద్దరు నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించామని, ప్రజలకు ఇచ్చిన హామీలపై అమలే ప్రధాన లక్ష్యమని ఇద్దరు నేతలు ప్రకటించారు.
డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవిపై సిద్ధరామయ్య స్పందించారు. అధిష్ఠానం ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడే డీకే సీఎం అవుతారని రామయ్య తెలిపారు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ ఐక్యంగా ఉన్నారని, 2028 అసెంబ్లీ ఎన్నికలను కలిసి ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం శివకుమార్‌తో తనకున్న విభేదాలపై సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ తమ మధ్య ఎలాంటి వివాదం లేదని, కలిసి ప్రభుత్వాన్ని నడుపుతామన్నారు. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని బీజేపీ ఆలోచిస్తోందని, దానిని తీవ్రంగా ప్రతిఘటిస్తామని తేల్చిచెప్పారు.