10 June, 2026 | 1:31 AM

వినోదం పంచుతూ సందేశమిచ్చే సిద్ధుగాడి లవ్ స్టోరీ

10-06-2026 12:00 AM

మనోజ్‌కుమార్ హీరోగా, మోహన్‌సిద్ధి, శ్రుతి శంకర్ హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’. ఈ సినిమాను రమేశ్ చెరుకూరు దర్శకత్వంలో సావిత్రమ్మ సీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటుడు సుమన్, స్నేహ, ఆనంద్ భారతి, సర్కార్, అలీషా, చిత్రం శ్రీను ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. పలువురు సినీప్రముఖుల ప్రముఖుల సమక్షంలో ఈ చిత్ర టీజర్, ట్రైలర్ ఆవిష్కరణ జరిగింది.

హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు ఏ కోదండరామిరెడ్డి, బీ గోపాల్, దామోదర ప్రసాద్, తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య, దర్శకులు వీ సముద్ర, రామ్‌ప్రసాద్, నటుడు, -నిర్మాత అశోక్‌కుమార్, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్, రాజేందర్‌ప్రసాద్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు మనోజ్‌కుమార్ మాట్లాడుతూ.. “సొంతూరిని వదిలి దూరంగా ఉంటున్న వారి జీవితాలకు దగ్గరగా ఉండే కథ ఇది” అన్నారు.

‘ప్రేక్షకులందరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంద’ని హీరోయిన్ మోహన్ సిద్ధి చెప్పారు. మరో హీరోయిన్ శ్రుతి శంకర్ మాట్లాడుతూ “మంచి కథతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది” అని తెలిపారు. దర్శకుడు రమేశ్ చెరుకూరు మాట్లాడుతూ.. “ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రేమకథతోపాటు మంచి సందేశాన్ని కూడా ఈ సినిమాలో చూపించబోతున్నాం.

త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం. ప్రేక్షకులందరూ మా చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నా” అన్నారు. ‘చిత్రంలోని పాటలు ప్రేక్షకులను అలరిస్తాయ’ని సంగీత దర్శకుడు ఆదిత్య చెప్పారు. ఈ కార్యక్రమంలో అతిథులు కూడా మాట్లాడారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు వీ సాంబశివరావు, వేణు గోపాలచారి, చిత్రబృందం పాల్గొన్నారు.