10 June, 2026 | 1:24 AM

టీఎఫ్‌సీసీ షార్ట్ ఫిలిం అవార్డ్స్ జ్యూరీ చైర్‌పర్సన్‌గా ఇంద్రజ

10-06-2026 12:00 AM

చిత్ర పరిశ్రమలో కొత్తవాళ్లను ప్రోత్సహించేందుకు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ ‘టీఎఫ్‌సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026’ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఫెస్టివల్‌కు భారీగా ఎంట్రీలు వస్తున్నాయని మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో రామకృష్ణగౌడ్ తెలిపారు. ఈ అవార్డుల కమిటీ జ్యూరీకి చైర్‌పర్సన్‌గా నటి ఇంద్రజను ఎంపిక చేసినట్టు ఆయన వెల్లడించారు.

దాదాపు 30 కేటగిరీల్లో మొదటి ఐదుగురు విజేతలకు అవార్డ్స్ ఇస్తామని, మొదటి ముగ్గురు విజేతలకు అవార్డ్స్‌తోపాటు నగదు బహుమతి కూడా అందిస్తా మని ప్రకటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడుల్లోని తెలుగువాళ్లు కూడా తమ షార్ట్ ఫిలింస్ ఈ పోటీకి పంపవచ్చన్నారు. రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ.. “ఎన్నో ఆశలతో ఇండస్ట్రీ లోకి వస్తున్న కొత్తవారిని ప్రోత్సహించ డానికి ఈ పోటీలు నిర్వహిస్తున్నాం.

మొదటి బహుమతిగా రూ.10 వేలు, రెండో బహుమతిగా రూ.7500, మూడో బహుమతిగా రూ. 5000 ఇస్తాం. ఎంట్రీ ఫీజు తీసుకోవడం లేదు. ఈ నెల 13 వరకు సమయం ఉంది. ఈ నెల 21న హైదరాబాద్‌లో ఈవెంట్ నిర్వహిస్తాం” అన్నారు. జ్యూరీ చైర్‌పర్సన్ ఇంద్రజ మాట్లాడుతూ.. “కంటెంట్ క్రియేట్ చేయడమే కాదు అది ప్రదర్శించే వేదిక బాగుండాలి. టీఎఫ్‌సీసీ లాంటి పేరున్న అసోసియేషన్ ద్వారా మీ కంటెంట్ ప్రదర్శితమైతే అది అందరికీ చేరువ అవుతుంది.

ఈ అవార్డ్స్ ద్వారా వచ్చే నగదు తక్కువని అనుకోవద్దు. ఈ అవార్డ్ విలువను డబ్బుతో కొలవలేం” అని తెలిపారు. జ్యూరీ మెంబర్, మ్యూజిక్ డైరెక్టర్ భోలే శావలి మాట్లాడుతూ.. “టీఎఫ్‌సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026’లో నేనూ భాగస్వా మిని కావడం సంతోషంగా ఉంది. మంచి పేరున్న రామకృష్ణగౌడ్ నిర్వహిస్తున్న ఈ అవార్డ్స్ పోటీల్లో ఔత్సాహికులు పెద్ద ఎత్తున పాల్గొనాలి” అని చెప్పారు.