ప్రజల కోసమే పోలీసులు సిద్దిపేట సీపీ
చేర్యాల: చేర్యాల మండలంలోని అకునూరు గ్రామాన్ని బుధవారం సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాల్ సందర్శించారు. కాకతీయుల కాలంలో నిర్మించిన శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.మాదకద్రవ్యాల వ్యతిరేకత థీమ్‌తో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలను ఆమె పరిశీలించారు. స్థానిక పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. సిద్దిపేట సురక్ష నేత్ర కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన 16 సిసి కెమెరాలను పాఠశాలలో 4 సీసీ కెమెరాలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీపీ గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ఏప్రిల్ 1న ప్రారంభమైన 'మన పోలీస్ - మన ఊరు' కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని అన్నారు. పోలీసులు అంటే బయట వ్యక్తులు కాదు మన పోలీస్ అనే భావన ప్రజల్లో రావాలి అని గ్రామంలో ఏదయినా సమస్య తలెత్తినా నిస్సంకోచంగా పోలీసులను సంప్రదించాలని అన్నారు.వయసు మీద పడిన తల్లిదండ్రులను వారి కుమారులు సరిగ్గా చూసుకోకపోవడం, డ్రగ్స్,మద్యం అలవాట్లు వంటి సమస్యలపై మాకు వినతులు వస్తున్నాయి వీటన్నింటికీ గ్రామస్తులతో కలిసి పరిష్కారం కనుగొంటాం అని అన్నారు.
పోలీసులు కేవలం చట్టాన్ని అమలు చేయడమే కాకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని ఒగ్గు కథలు పాటలు వీడియోలు ద్వారా అవగాహన కార్యక్రమాలు చూస్తున్నామని, గ్రామ పెద్దలు యువత దారి తప్పకుండా చూసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్,కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని విజ్ఞప్తి చేశారు.తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ వారిని ఉన్నత శిఖరాలకు చేరుకునేలా ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు డిక్షనరీలు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు అందించారు.






