పాపం పసిపాప
కారు డోర్ ఆటో లాక్
3 ఏళ్ల చిన్నారి మృతి
భద్రాద్రి జిల్లాలో విషాదం
భద్రాద్రి కొత్తగూడెం, మే 22 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సాం బాయి గూడెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పార్కింగ్ చేసిన కారులో ఊపిరాడక మడకం కల్నిష అనే చిన్నారి మృతిచెందింది. స్థానికుల కథనం ప్రకారం.. సాంబాయి గూడెం గ్రామానికి చెందిన సాయికుమార్, లిఖిత దంపతులకు మూడేళ్ల వయసున్న కల్నిష అనే కుమార్తె ఉంది. చిన్నారి బుధవారం ఇంటి ఆవరణలో ఆడుకుంటూ పార్కింగ్ చేసి పెట్టిన తమ కారు ఎక్కింది.
చిన్నారి కారు ఎక్కగానే డోర్స్ ఆటోమేటిక్‌గా లాక్ అయ్యాయి. పాప ఎక్కడో ఆడుకుంటుంది అని తల్లిదండ్రులు భావించారు. తర్వాత ఎంతసేపటికీ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పాప కోసం వెతకగా కారులో అపస్మారకస్థితిలో పడి ఉంది. దీంతో వారు అద్దాలు పగులగొట్టి చిన్నారిని బయటకు తీయ గా అప్పటికే చనిపోయింది. చిన్నారి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.






