విజయక్రాంతి ఎఫెక్ట్.. కదిలిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు
గజ్వేల్,సెప్టెంబర్ 1(విజయ క్రాంతి): ములుగు మండలం కమలాబాద్ తెట్టేకుంటను ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు మంగళవారం పరిశీలించారు. ‘విజయక్రాంతి’(Vijayakanthi)లో ప్రచురితమైన రియల్ ఇరిగేషన్(Real Irrigation) కుమ్మక్కు' వార్త కథనానికి అధికారులు స్పందించారు. ములుగు(Mulugu) మండలం కమలాబాద్ గ్రామంలోని తెట్టేకుంటను ఇరిగేషన్ ఏఈఈలు జయశ్రీ, ప్రసాద్‌లతో కలిసి రెవిన్యూ ఇన్స్పెక్టర్ నర్సింలు పరిశీలించారు.
చెరువు కట్ట ఎత్తు పెంచడం వల్ల బఫర్ జోన్ పరిధి పట్టా రైతుల పంట పొలాలు నీట మునిగే ప్రమాదం ఉందన్న అంశంపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. తెట్టేకుంటను విస్తీర్ణం సుమారు 6.06 ఎకరాలు ఉండగా, కట్ట ఎత్తు పెంచడం వల్ల కుంటలో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి చుట్టుపక్కల ఉన్న పట్టా భూముల్లోకి నీరు చేరే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు.
దీంతో రైతులు తమ పంట పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో తెట్టేకుంటను ప్రస్తుత పరిస్థితులను కట్ట ఎత్తులో మార్పును పరిశీలించామని, పూర్తి వివరాలతో తహసీల్దార్‌కు నివేదిక అందజేస్తామని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు తెలిపారు. అధికారులు స్పందించి కుంటను పరిశీలించడంతో రైతుల్లో కొంత ఊరట వ్యక్తమైంది.






