25 July, 2026 | 8:04 PM

Breaking News

రాజకీయాలకతీతంగా ‘సర్'ను నిర్వహించాలి

25-07-2026 07:30 PM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

వరంగల్,(విజయక్రాంతి): రాజకీయాల కతీతంగా  ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ‘సర్’ ను నిర్వహించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కోరారు. శనివారం ఫూలే ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రంలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగాధిపతి డాక్టర్ సంగని మల్లేశ్వర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చైతన్యవంతమైన తెలంగాణలో మిగతా రాష్ట్రాల మాదిరిగా ఓటర్ల తొలగింపు  కుటిలయత్నాలు చెల్లవని, వారం రోజులపాటు ప్రజా సంఘాలు, సామాజిక ఉద్యమకారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

పాస్ ఆధ్వర్యంలో  'సర్' ప్రక్రియ పై నిర్వహించిన సెమినార్ లో ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే నగరాల్లో సర్ ప్రక్రియ మందకొడిగా కొనసాగుతున్నదన్నారు. తమ నియోజకవర్గంలో  బిఎల్ఓ లు, బి ఎల్ ఎ ల సహకారంతో ఇప్పటివరకు 58 శాతం సర్ ప్రక్రియ పూర్తి చేయించామని, ఇంకా వారం రోజుల సమయంలో 80 శాతం ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఓటు ద్వారానే మన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నందున అర్హులందరూ సర్ ప్రక్రియలో భాగస్వాములు కావాలని రాజేందర్ రెడ్డి చెప్పారు. రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలు విద్యార్థులు, మేధావులు, అన్ని వర్గాల వారు ఓటు నమోదు ప్రక్రియలో పాల్గొనాలని ఆయన అభ్యర్థించారు.

ప్రొఫెసర్ డాక్టర్ రాజారాం మాట్లాడుతూ సర్ ప్రక్రియలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఆగస్టు 3 వరకు ఈ ప్రక్రియ పూర్తికానుందని, ఆగస్టు 8వ తేదీన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వెలువడుతుందని వివరించారు. 141 కోట్ల జనాభాకు సర్ ప్రక్రియ కొనసాగుతుందని, రెండో విడతలో ఆరు రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. తెలుగు అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటనారాయణ మాట్లాడుతూ సర్ ఫారంలో ఉన్న సంక్లిష్టత లను తొలగించాలన్నారు. యువత పౌర సమాజం బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కాపాడుకునే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం రాజనీతి శాస్త్రం ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు, రచన జర్నలిజం కళాశాల ప్రిన్సిపల్ ఆర్. ఉమామహేశ్వర్ మాట్లాడుతూ సర్ ప్రక్రియ ఫై మీడియా ప్రజలను మరింత చైతన్యవంతులను చేయాల్సి ఉందని అలాగే ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైన తర్వాత కూడా అభ్యంతరాలు ఉంటే  పరిష్కరింప చేసేలా మీడియా కృషి చేయాలని  పిలుపునిచ్చారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ జర్నలిజం విభాగం అధ్యాపకులు డా.యాదగిరి మాట్లాడుతూ... ప్రజాస్వామ్యం బలోపేతం కు సర్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆచార్య కూరపాటి వెంకట్ నారాయణ చైర్మన్ అకాడమీ, తెలంగాణ గారిని ఘనంగా సన్మానించారు.