స్వగ్రామంలో శిరీషకు అంత్యక్రియలు
పాడే మోసిన ఎమ్మెల్యే జారే
ములకలపల్లి, ఆగస్టు 31 (విజయక్రాంతి): హైదరాబాదులో దారుణ హత్యకు గురైన ఊకే శిరీష మృతదేహానికి సోమవారం ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామంలో కుటుంబ సభ్యులు,గ్రామస్తుల రోదనల మధ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత ఆమె మృతదేహాన్ని ఆదివారం రాత్రి గ్రామానికి తీసుకొచ్చారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ రాత్రి నుంచి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు దగ్గరుండి కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు.
శిరీష పాడేను మోసి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యాన్ని కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిరీష మృతికి కారణమైన నిందితులకు చట్టం ప్రకారం శిక్ష పడటం ఖాయమని కుటుంబానికి ప్రభుత్వ పార్టీ పరంగా అన్ని విధాల ఆదుకొని సాయం అందిస్తానని భరోసా కల్పించారు. శిరీష మృతికి కారణమైన నిందితుడిని వెంటనే పోలీసులు అరెస్టు చేశారని ఈ హత్యలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందని అంశాలపై పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు.
ఈ మధ్యలో పాల్గొన్న వారందరిపై తప్పకుండా చర్యలు ఉంటాయని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ మెచ్చా నాగేశ్వరరావు శిరీష భౌతికకాయానికి నివాళులు అర్పించారు.
ఈ అంత్యక్రియల్లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జహీరుద్దీన్, ములకలపల్లి, దమ్మపేట మాజీ జెడ్పీటీసీ సభ్యులు బత్తుల అంజి, పైడి వెంకటేశ్వరరావు, తాండ్ర ప్రభాకర్‌రావు, సర్పంచులు కుంజారవి, కుంజావినోద్, మాజీ సర్పంచి సుధీర్, ఆదివాసీ నాయకులు ఊకె రవి, కట్రం స్వామి,సోయం వీరభద్రం, సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు,నిమ్మల మధు పాల్గొన్నారు. పాల్వంచ సీఐ పర్యవేక్షణలో ఎస్‌ఐ బందోబస్తు నిర్వహించారు.






