1 September, 2026 | 1:58 AM

నర్సు హత్య కేసులో నిందితుడి అరెస్ట్

01-09-2026 01:06 AM
  1. 30 గంటల్లోనే కేసు చేదన 
  2. ఆగస్టు 28న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో దారుణం

శంషాబాద్, ఆగస్టు 31(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సు(21)ను హత్య చేసిన కేసును మిస్టరీ వీడింది. పహాడీషరీఫ్, శంషాబాద్ జోనల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కేవలం 30 గంటల్లో కేసును ఛేదించారు. బీహార్‌కు చెందిన నిందితుడు ఎండీ సనావుల్లా(34)ను అరెస్ట్ చేసినట్లు శంషాబాద్ డీసీపీ బి.రాజేష్ వెల్లడించారు.

కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ మీడియాకు తెలిపారు. బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లాకు చెందిన సనావుల్లా తుక్కుగూడలోని ఓ బైక్ మెకానిక్ షాపులో పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. తన షాపు వెనుక ఉన్న కిటికీ నుంచి గత నెల రోజులుగా బాధితురాలి కదలికలను గమనిస్తూ, ఆమెపై కన్ను వేశాడని దర్యాప్తులో తేలింది. ఆగస్టు 28న అర్ధరాత్రి నిందితుడు కిటికీ ద్వారా నర్సు గదిలోకి చొరబడ్డాడు. బాధితురాలు కేకలు వేయడంతో ఆమె నోరు మూసి, గొంతు పట్టుకున్నా తీవ్రంగా ప్రతిఘటించింది.

ఆగ్రహానికి గురైన నిందితుడు ఆమె గొంతు నులిమి హతమార్చి, ఆమెపై అత్యాచారం చేశాడు. మరుసటి రోజు ఉదయం బాధితురాలు బయటకు రాకపోవడంతో స్నేహితురాలు వెళ్లి చూడగా రక్తమడుగులో శవమై కనిపించింది. సమాచారం అందుకున్న పహాడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పర్యవేక్షణలో, డీసీపీ బి.రాజేష్ ఆదేశాలతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలు,

సాంకేతిక సమాచారాన్ని విశ్లేషించి 30 గంటల్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నాయి. నిందితుడి నుంచి శామ్‌సంగ్ మొబైల్ ఫోన్, దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. వేగంగా కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని డీసీపీ ప్రత్యేకంగా అభినందించారు. మహిళల భద్రతకు భంగం కలిగిస్తే ఎంతటి వారికైనా కఠిన శిక్ష తప్పదని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.