calender_icon.png 1 February, 2026 | 5:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్‌కి సిట్ నోటీసులు రాజ‌కీయ క‌క్ష సాధింపు చ‌ర్య‌నే

01-02-2026 03:56:42 PM

హనుమకొండ,(విజయక్రాంతి): కెసిఆర్ కు సీట్ నోటీసులు ఇవ్వడం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమేనని, కెసిఆర్ ప్రతిష్టను దిగజార్చుటలో భాగంగా కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని ప్రభుత్వ మాజీ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు.భారత రాష్ట్ర సమితి పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయం బాలసముద్రం నుంచి నక్కలగుట్ట - అదాలత్ - అంబేద్కర్ సర్కిల్ - పబ్లిక్ గార్డెన్ - హనుమకొండ చౌరస్తా - ములుగు రోడ్ - ఎంజీఎం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి, ఎంజీఎం సర్కిల్ లో ప్రభుత్వ, రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను వినయ్ భాస్కర్ ఆధ్వర్యం లో దహనం చేసి, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ధర్నా చేశారు. ధర్నా లో పోలీసులు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. ధర్నా అనంతరం దాస్యం వినయ్ భాస్కర్ ను గులాబీ శ్రేణులను అరెస్ట్ చేసి మట్టెవాడ పోలీసు స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ త‌ల్లి క‌న్నీటి గోస తీర్చిన అప‌ర భ‌గీర‌థుడు కేసీఆర్ అని,ఈ తెలంగాణ నేల కోసం ప్రాణాల‌కు తెగించిన వీరుడు కేసీఆర్ అని,గాంధీజీ, అంబేద్క‌ర్ ఆశ‌యాల బాట‌లో తెలంగాణ‌ను దేశంలోనే అగ్ర‌గామిగా నిలిపిన ప‌రిపాల‌నాధ‌క్షుడు కేసీఆర్ అని,నోటీసులు, క‌మిష‌న్లు, కేసులు, కుట్ర‌లు ఎన్ని చేసినా  కేసీఆర్ ను ఏం చేయలేవన్నారు.సిట్ అధికారులు వ్యవహరించిన తీరు చట్టాలకి వ్యతిరేకం అని, సిట్ అధికారులకి నోటీసు ఇచ్చే అధికారమే లేదు అన్నారు.ఈ కాంగ్రెస్ నేత‌ల సిట్‌, బొట్‌ల‌కు కేసీఆర్ భయపడరని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి గ్రామ స్థాయిలో వ‌చ్చిన ఆద‌ర‌ణ‌, పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో గులాబీ శ్రేణులు చూపిన తెగువ‌కు భ‌య‌ప‌డి మున్సిప‌ల్ ఎన్నికల స‌మ‌యంలో కావాల‌నే నోటీసులు ఇచ్చి,డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేస్తోందన్నారు.

కాంగ్రెస్ ఎన్ని కుట్ర‌లు చేసినా ప్ర‌జా క్షేత్రంలో తిప్పికొడ‌తామని, రాష్ట్రంలోని మెజార్టీ మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పార్టీ కైవ‌సం చేసుకుంటుందనీ,420 హామీలు, 6 గ్యారంటీలు అమ‌లు చేయ‌డం చేత‌కాక ప్ర‌జ‌ల త‌ర‌పున ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల‌ను కేసుల పేరుతో, విచార‌ణ పేరుతో వేధిస్తోందన్నారు. అన్ని ఎగ‌వేత‌లు, కూల్చివేత‌లు, కోత‌లు త‌ప్ప ఈ రెండేళ్ల కాంగ్రెస్ చేసిన ఒక్క మంచి ప‌ని లేదని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ను బొంద పెడతారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సోద కిరణ్, మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్, పులి రజనీకాంత్, ముటిక రాజు యాదవ్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.