25 June, 2026 | 12:54 AM

ఎల్బీనగర్‌కు ‘స్కైవాక్’ సింగారం

25-06-2026 12:01 AM

రూ.87 కోట్లతో ట్రాఫిక్ కష్టాలకు చెక్!

ఎల్బీనగర్ /నాగోల్,జూన్ 24 (విజయక్రాంతి): మహానగరం తూర్పు ముఖద్వారమైన ఎల్బీనగర్ చౌరస్తా త్వరలోనే అంతర్జాతీయ స్థాయి హంగులతో మెరిసిపోనుంది. నిత్యం లక్షలాది వాహనాలు, ప్రయాణికులతో రద్దీగా ఉండే ఈ జంక్షన్లో కాలినడకన రోడ్డు దాటడమంటే ప్రాణాలతో చెలగాట మే. ఈ ప్రమాదాలకు, ట్రాఫిక్ జాంలకు శాశ్వత పరిష్కారం చూపుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రూ.87 కోట్ల ‘స్కైవాక్’ (పాదాచారుల ఆకాశమార్గం) పనులు ప్రస్తు తం శరవేగంగా తుది దశకు చేరుకున్నాయి.

మెట్రో స్టేషన్కు అనుసంధానంగా నాలుగు వైపులా నడక దారి

ఎల్బీనగర్ రింగ్ రోడ్డు వద్ద ఈ భారీ స్కైవాక్ అందుబాటులోకి వస్తే రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులోని ప్రధా న విశేషం ఏమిటంటే, దీనిని ఎల్బీనగర్ మెట్రో స్టేషన్తో నేరుగా అనుసంధానిస్తున్నారు.దీనివల్ల ప్రయాణికులు కింద రోడ్డుపైకి వచ్చి ప్రమాదాల బారిన పడకుండానే.. మెట్రో స్టేషన్ నుండి చౌరస్తాకు నాలుగు వైపులా సురక్షితంగా చేరుకోవచ్చు.

ఇక్కడి నుంచే విజయవాడ వైపు,దిల్సుఖ్నగర్ వైపు,సికింద్రాబాద్ / నాగోలు వైపు, చంద్రాయణగుట్ట వైపు నిర్మించనున్నారు.దీనివల్ల ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, పాఠశాల విద్యార్థులు రోడ్డు దాటే ఇబ్బందులు తప్పుతాయి.ఇటీవల బీఎన్ రెడ్డి నగర్లో ఎకో పార్కు పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి, తాజాగా ఎల్బీనగర్ స్కైవాక్ నిర్మాణానికి అవసరమైన నిధులు, అనుమతులు ఇస్తూ ప్రత్యేక దృష్టి సారించడంతో పనులు చకచకా పనులు కొనసాగుతున్నాయి.

కోట్ల రూపాయలతో సర్వాంగ సుందరంగా జంక్షన్

కేవలం స్కైవాక్ మాత్రమే కాకుండా, ఈ జంక్షన్ను ఒక మోడల్ ఐకాన్గా మార్చేందుకు ప్రభుత్వం భారీ బడ్జెట్తో ప్రణాళికలు అమలు చేస్తోంది. స్కైవాక్ నిర్మాణంరూ. 87.00 కోట్లు,పాదచారుల భద్రత, సిగ్నల్ ఫ్రీ ట్రాఫిక్ నివారణ,జంక్షన్ బ్యూటిఫికేషన్రూ. 1.50 కోట్లుచౌరస్తా పరిసరాలను గ్రీనరీతో ఆహ్లాదకరంగా మార్చడం,సీసీ రోడ్ల నిర్మాణంరూ. 1.37 కోట్లు,రింగ్ రోడ్డు వద్ద రహదారుల బలోపేతం,వరద నీటి పైప్లైన్రూ. 81.00 లక్షలు కేటాయింపు.వర్షాకాలంలో రోడ్డుపై నీరు నిలవకుండా నివారించడం ముఖ్య ఉద్దేశం.

రాబోయే ఏడాదిలో సరికొత్త లుక్

ఈ ప్రాజెక్టును మరింత ఆధునీకరించేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం నడక దారే కాకుండా, రాబోయే ఏడాది కాలంలో ఈ స్కైవాక్కు మరికొన్ని అదనపు హంగులను జోడించనున్నారు. వృద్ధులు, దివ్యాంగులు సులువుగా పైకి వెళ్లేందుకు వీలుగా ఆధునిక లిఫ్టులు, ఎస్కలేటర్లను ఏర్పాటు చేస్తున్నారు. స్కైవాక్ పైనే ప్రయాణికులకు అవసరమైన తాగునీరు, మ్యాగజైన్లు, స్నాక్స్ లభించేలా చిన్న కియోస్క్లను ప్లాన్ చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఈ స్కైవాక్ నగరానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా రంగురంగుల ఎల్‌ఈడీ థీమ్ లైటింగ్ను అమర్చనున్నారు.

సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు :

సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం. ప్రధానంగా ఇక్కడి ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించి, ప్రజా రవాణాకు, ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తాం‘ అని నియోజకవర్గ ఇంచార్జ్ మధుయాష్కి గౌడ్ స్పష్టం చేశారు. ఈ భారీ ప్రాజెక్టుతో ఎల్బీనగర్ రూపురేఖలు మారిపోతుండడంతో స్థానిక ప్రజలు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.