29-10-2025 12:00:00 AM
ఎల్బీనగర్, అక్టోబర్ 28 : టూరిస్ట్ గైడ్ పై హోటల్ సిబ్బంది దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... విస్లావాత్ శంకర్ హైదరాబాద్ కు వచ్చిన టూరిస్టులకు సిటీని చూపిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. కాగా, ఈ నెల 21న గుజరాత్ నుంచి కొంతమంది టూరిస్ట్ లు హైదరాబాద్ కు సిటీ చూడటానికి వచ్చారు.
వీరికి శంకర్ టూరిస్ట్ గైడ్ గా ఉండడంతో కర్మన్ ఘాట్ లో వున్న ఎన్7 ఎలైట్ హోటల్ లో 22 ఏసీ రూమ్ లు బుక్ చేసి, బీసీ కల్పించాడు. కాగా, 22వ తేదీన ఉదయం 06:30 గంటల ప్రాంతంలో హోటల్ సిబ్బంది గదులను తనిఖీ చేసే సమయంలో శంకర్ రూ, 600 తక్కువ ఇచ్చాడు. ఈ విషయంలో హోటల్ సిబ్బంది నూర్, కమలుద్దీన్, ఇస్లాం జహీదుల్, రహీమ్ అనే నలుగురు వ్యక్తులు శంకర్ పై దాడి చేశారు. గాయపడిన శంకర్ సమీపంలోని ఫోకస్ హాస్పిటల్ కి వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకుని ఇంటికి వెళ్లాడు. అయితే, 26వ తేదీన శంకర్ గాయాలు తగ్గకపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ లో ఉస్మానియా హాస్పిటల్ కి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ 27వ తేదీన శంకర్ మృతి చెందాడు. ఈ మేరకు మృతుడి కుమారుడు వంశీకృష్ణ సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సైదిరెడ్డి తెలిపారు.