12 June, 2026 | 4:45 PM

సారంగపల్లి అడవిలో గుర్తుతెలియని వ్యక్తి అస్థిపంజరం లభ్యం.. కలకలం..

12-06-2026 03:45 PM

- రంగంలోకి క్లూస్ టీం 

- మృతిని ఆచూకీపై ఆరా

​మందమర్రి,(బెల్లంపల్లి),(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా మందమర్రి సమీప అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి అస్థిపంజరం లభ్యం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మందమర్రి మండలం సారంగపల్లి గ్రామానికి చెందిన మేకల కాపరి కేశవగేని బాలయ్య అనే వ్యక్తి శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో తన మేకలను మేపడానికి సారంగపల్లి అడవిలోనికి వెళ్ళాడు. ఆ సమయంలో అడవిలో ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఆయనకు కనిపించింది.

మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయి, కేవలం అస్థిపంజరం మాత్రమే ఉంది. బాలయ్య వెంటనే ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ బచ్చలి రాములుకు సమాచారం ఇచ్చారు. సర్పంచ్ తో సారంగపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి పుప్పాల సవ్య సంఘటనా స్థలానికి వెళ్లారు. తల భాగం (పుర్రె), చేతులు, కాళ్ళు ఎముకలతో ఉన్న అస్థిపంజరాన్ని గుర్తించారు. మృతదేహం పక్కన లేత నీలం రంగు (Sky Blue) ప్యాంటు, దానికి బెల్టు ధరించి ఉంది. మృతదేహంపై చర్మం, మాంసం ఏమిలేదు. కేవలం అస్థిపంజరం మాత్రమే ఉంది.

అడవి జంతువులు మృతదేహాన్ని తినేసి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పంచాయతీ కార్యదర్శి పుప్పాల సవ్య మందమర్రి పోలీస్ స్టేషన్‌లోరాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈమేరకు మందమర్రి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు?ఎలా మృతి చెందాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  మృతదేహం లభించిన అడవి ప్రాంతాన్ని క్లూస్ టీమ్  ఉన్నతాధికారులు సందర్శించి ఆధారాలు సేకరిస్తున్నారు.