14-11-2025 12:00:00 AM
భయందోళనకు గురైన ప్రయాణికులు
అలంపూర్, నవంబర్, 13: గద్వాల జిల్లాలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం గద్వాల జిల్లా కేంద్రం నుంచి అయిజ మీదుగా కర్నూలుకు బయలు దేరింది. ఈ క్రమంలో మానవపాడు మండలం మద్దూరు స్టేజి సమీపంలో బస్సులో పొగలు వ్యాప్తి చెందాయి. దీంతో ప్రయాణికులు భయోందోళనకు గురై కేకలు వేయగా అప్రమత్తమైన డ్రైవర్ బస్సును వెంటనే నిలిపి సీటు వద్ద సిలిండర్లతో మంటలను ఆర్పి వేశాడు. ప్రయాణికులతో పాటు మద్దూరు గ్రామస్తులు పక్కనే ఉన్న ఆర్డీఎస్ కాలువ నుంచి నీటిని బకెట్లతో తీసుకొచ్చి మంటలను అదుపు చేశారు.
దీంతో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే బస్సులో 130 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. బస్సులో కెపాసిటీకి మించి ప్రయాణికులు ఎక్కడంతో బస్సు ఓవర్ లోడ్ కావడం వల్లే మంటలు వ్యాపించాయని డ్రైవర్ సత్యా రెడ్డి తెలిపారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని పరిశీలించారు. అయితే ఇటీవలె కర్నూలు శివారులోని చిన్నటేకూరు వద్ద చేసుకున్న ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురైనట్లు తెలిపారు. ప్రయాణికుల యోగక్షేమాలను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు తెలిపారు.