వానకు నాని.. ఎండకు ఎండి!
- అకాల వర్షాలతో రైతన్న ఆగం
- వానకు తడిసి ముద్దవుతున్న ధాన్యం
- కనికరించాలని సర్కారుకు విజ్ఞప్తి
తాడ్వాయి, మే, 27( విజయక్రాంతి): ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి రైతులు నానా తంటాలు పడుతున్నారు.ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని సకాలంలో అమ్ముకోలేకపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. గిట్టుబాటు ధర వస్తుందని దీంతో డబ్బులు ఎక్కువగా వస్తాయని ఆశపడ్డ రైతులకు ఇబ్బందులే ఎదురవుతున్నాయి. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో ధాన్యం పండించిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది.
గత నెల రోజుల నుంచి కొనుగోలు కేంద్రాల్లో పోసి ఉంచిన ధాన్యాన్ని అధికారులు తీసుకువెళ్లడం లేదని ఆందోళన చెందుతున్నారు. మండలంలోని నందివాడ, ఎర్రపహాడ్, ఏండ్రియాల, కృష్ణాజివాడి, బ్రహ్మాజీవాడి, బ్రాహ్మణపల్లి గ్రామాలలో రైతు కొనుగోలు కేంద్రాల్లో పోసి ఉంచిన ధాన్యం మంగళవారం కురిసిన అకాల వర్షానికి తడిసిపోయింది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ధాన్యం ఎలా అమ్ముకోవాలో అని ఆందోళన పడుతున్నారు.
గిట్టుబాటు ధర కోసం చూస్తే ఉన్న ధాన్యం పోయేట్లుంది..
ప్రభుత్వం అందించే మద్దతు ధర వస్తుందనుకొని తాము కొనుగోలు కేంద్రాల్లో తమ ధాన్యం పెట్టుకుని ఉంటే ఉన్న ధాన్యం ఊడుచుకుపోయేటట్లు ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఒక క్వింటాలకు మద్దతు ధర రూ.2,400 కేటాయించింది.దీంతో తమ ధాన్యానికి మంచి ధర వస్తుందని ఆశతో కొనుగోలు కేంద్రాల్లో దాన్యం పెట్టుకుని ఉంటే అకాల వర్షానికి తడిసి ముద్దవుతుందని రైతులు వాపోతున్నారు.
వెంట వెంటనే ధాన్యాన్ని తరలించినట్లయితే ఇలాంటి ఇబ్బందులు ఉండేవి కావని వాపోతున్నారు. బయట మార్కెట్లో వ్యాపారులు ఒక క్వింటాల్ ధాన్యాన్ని రూ.1700 నుంచి రూ.1800 లకు కొనుగోలు చేస్తున్నారు. బయట మార్కెట్లో ధాన్యం విక్రయిస్తే చాలా నష్టపోవాల్సి వస్తుందని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలనుకుంటే ఇక్కడ ఇబ్బందులు తప్పడం లేదని రైతులు మొత్తుకుంటున్నారు.
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
అకాల వర్షానికి తడిసిపోయిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు. తాము ధాన్యాన్ని తడవకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా అకాల వర్షాలకు ఆపలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చాలా వేగంగా ధాన్యం కొనుగోలు చేసి ఇక్కడి నుంచి ధాన్యాన్ని తరలించాలని రైతుల కోరుతున్నారు.
పక్కా ప్రణాళికలు లేకపోవడంతోనే...
రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అధికారులు పక్కా ప్రణాళికలు రూపొందించకపోవడంతోనే రైతులు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. జిల్లాలో తాడువాయి, రాజంపేట, సదాశివ నగర్, ఎల్లారెడ్డి, లింగంపేట,నాగిరెడ్డిపేట,గాంధారి,కామారెడ్డి, రామారెడ్డి, మాచారెడ్డి మండలాల్లో రైతులు ధాన్యం పండించి వరి కొనుగోలు కేంద్రాల్లో తమ ధాన్యాన్ని ఉంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అకాల వర్షాల నుంచి తమను రక్షించాలని వారు కోరుతున్నారు.






