బాల్యాన్ని చిదిమేస్తున్న సోషల్ మీడియా
ఒకప్పుడు బాల్యమంటే బొమ్మలాటలు, చెరువు దగ్గర ఈతలు, చెట్టు నీడలో కథలతో సాగేది. సాయంత్రం వేళ స్నేహితులతో ఆడుకునే ఆటలు ఆ మధుర జ్ఞాపకాల్లో అంతర్భాగంగా ఉండేవి. నేడు బాల్యం అంటే చేతిలో మొబైల్, కళ్ల ముందు స్క్రీన్, గంటల తరబడి రీల్స్, షార్ట్స్‌గా మారిపోయింది. పిల్లలు నవ్వాల్సిన వయసులో నిశ్శబ్దంగా ఫోన్ స్క్రీన్లలో మునిగిపోతున్నారు.
భవిష్యత్తుకు పునాది వేయాల్సిన ఈ దశ సోషల్ మీడియా ప్రభావంతో మసకబారుతోందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. సమస్య తీవ్రరూపం దాల్చడంతో కొన్ని దేశాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఆస్ట్రేలియా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ చట్టం తెచ్చింది. ఫ్రాన్స్, నార్వే, బ్రిటన్, స్పెయిన్ వంటి దేశాలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి. పిల్లల మానసిక ఆరోగ్యం, చదువు, సామాజిక సంబంధాలను కాపాడటమే ఈ దేశాల ముఖ్య ఉద్దేశం.
ఈ పరిణామాల ప్రభావంతో భారత్‌లోనూ చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం విధించే దిశగా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సైతం 16 ఏళ్లలోపు వారికి నిషేధం విధిస్తామని చెప్పడంతో ఇతర రాష్ట్రాల్లోనూ దీనిపై ఆలోచన మొదలైంది. చిన్నారుల్లో పెరుగుతున్న మొబైల్ వ్యసనం, ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిస కావడం, చదువుపై శ్రద్ధ తగ్గడం వంటి అంశాలు ప్రభుత్వాలను కలవరపెడుతున్నాయి. నిజానికి సోషల్ మీడియా పిల్లల జీవితాల్లోకి వేగంగా ప్రవేశించింది. అంతే వేగంతో దాని ప్రతికూల ప్రభావాలు కూడా పెరుగుతున్నాయి. గంటల తరబడి రీల్స్ చూడటం వల్ల పిల్లల్లో ఏకాగ్రత తగ్గిపోతోంది.
లైకులు, కామెంట్లనే జీవితమని భావించే మాయాజాలంలో వారు చిక్కుకుంటున్నారు. సైబర్ బుల్లీయింగ్, అశ్లీల కంటెంట్, డిజిటల్ వ్యసనం వంటివి బాల్యాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, సోషల్ మీడియా పూర్తిగా చెడు అని చెప్పలేం. సంగీతం, నృత్యం, కళలు, విజ్ఞాన రంగాల్లో పిల్లలు తమ ప్రతిభను చాటుకోవడానికి ఇది ఒక వేదికగా నిలుస్తోంది. కోడింగ్, కొత్త భాషల నేర్చుకోవడం, సృజనాత్మక విద్యా సమాచారాన్ని పొందడానికి అవకాశాలు పెరిగాయి. కాబట్టి, సమస్య సోషల్ మీడియాలో లేదు. దానిని నియంత్రణ లేకుండా వాడటంలోనే ఉంది. ఇక్కడే అమలు విధానంలో పెద్ద సవాలు ఎదురవుతోంది.
పిల్లల వయస్సును ఖచ్చితంగా నిర్ధారించే సాంకేతికతను ఎలా తీసుకురావాలనేది ప్రశ్నగా మారింది. పిల్లలు ఎక్కువగా తల్లిదండ్రుల ఫోన్ల ద్వారానే సోషల్ మీడియా వాడుతున్నారు. అలాంటప్పుడు నిషేధాన్ని అమలు చేయడం కష్టతరమైన పని. తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉన్నప్పటికీ, నేటి తరం పిల్లలు సాంకేతికంగా వాటిని అధిగమించే స్థాయిలో ఉన్నారు. కేవలం చట్టంతోనే ఈ సమస్యకు పరిష్కారం లభించదు. ప్రభుత్వాలు తీసుకొచ్చే ఈ నిషేధాలను ఒక హెచ్చరికగా భావించాలి. మార్పు అనేది ఇంటి నుంచే మొదలు కావాలి. పిల్లల డిజిటల్ అలవాట్లపై తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షణ ఉంచాలి. స్క్రీన్ సమయానికి పరిమితులు విధించాలి. బయట ఆడుకునే ఆటలు, పుస్తక పఠనం, కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి ప్రాధాన్యం పెంచాలి.
బాల్యం అనేది జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అద్భుతమైన దశ. అది స్క్రీన్ వెలుగుల్లో కాకుండా జీవన వెలుగుల్లో వికసించాలి. సోషల్ మీడియా బంధనాల నుంచి బాల్యానికి విముక్తి కలిగించడం సమాజం బాధ్యత. చట్టాలు మార్గం చూపవచ్చు. పిల్లల భవిష్యత్తును కాపాడటంలో కుటుంబం, పాఠశాల, సమాజం కలిసి పని చేయాలి. ఇంటర్నెట్ ప్రపంచంలోని మంచి చెడుల గురించి వారికి చిన్నతనం నుంచే అవగాహన కల్పించాలి. తల్లిదండ్రులు స్వయంగా ఫోన్ వాడకాన్ని తగ్గించి పిల్లలకు ఆదర్శంగా నిలవాలి. ఇంట్లో ’నో ఫోన్ జోన్’ వంటి నిబంధనలు పెట్టుకోవడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఆత్మీయ సంభాషణలు పెరుగుతాయి.
మేకల కృష్ణ, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం




