7 April, 2026 | 3:44 AM

సదాచార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామాజిక ఆధ్యాత్మిక సేవలు

07-04-2026 01:24 AM

సూర్యాపేట, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): గత ఎనిమిది సంవత్సరాలుగా సదాచార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సామాజిక, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సదాచార్ ట్రస్ట్ కన్వీనర్ ఈగ దయాకర్ గుప్త తెలిపారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సదాచార్ ట్రస్ట్ కార్యాలయంలో సూర్యాపేట తాళ్లగడ్డ కు చెందిన నిరుపేద కుటుంబం  బత్తుల వెంకన్న, వరలక్ష్మిల కనిష్ట కుమార్తె రేణుక వివాహం నిమిత్తము దాత మిరియాల శివకుమార్, కవిత దంపతుల సహకారంతో పుస్తె, మట్టెలు, ఈగ విజయలక్షి, దయాకర్ గుప్తలు నూతన వస్త్రములు  అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హల్దిపూర్, వారణాసి, మఠాధితులు పరమ పూజ్య  శ్రీ వామనాశ్రమ మహా స్వామీజీ  ఆశీస్సులతో హైదరాబాద్ కు చెందిన సదాచార్ ట్రస్ట్ అధ్యక్షులు జి.సాయి ఈశ్వర్ అధ్యక్షతన సదాచార్ ట్రస్ట్ ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు నిరుపేద వధువులకు దాతల సహకారంతో 99 మంది వధువులకు పుస్తె, మెట్టెలు, నూతన వస్త్రాలు అందజేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు కేవలం ఒక్క సూర్యాపేట జిల్లాలోనే 73 మంది వధువులకు దాతల సహకారంతో అందజేసినట్లు తెలిపారు.

నూతనంగా సదాచార్ ట్రస్టు ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా గిరిజన ప్రాంతాలు, తండాలలో108 శ్రీ సీతారామ కళ్యాణాలు నిర్వహించుటకు సంకల్పం తీసుకున్నట్టు తెలిపారు. అందులో భాగంగా ఈ సంవత్సరం శ్రీరామనవమి రోజు నుండి ఇప్పటివరకు ఆదిలాబాద్ జిల్లాలో 9 కల్యాణాలు నిర్వహించినట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో కొందరు అన్యమతంలో చేరుతున్న  సందర్భంగా మన హిందూ ధర్మాన్ని పెంపొందించుటకు ఈ కళ్యాణాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సదాచార్ ట్రస్ట్ సబ్యులు మిరియాల శివకుమార్, కవిత, ఈగ విజయలక్ష్మి, బచ్చు పురుషోత్తం, హనుమాళ్ళ పుష్ప, మొలుగురి పద్మ,సంధ్య తదితరులు పాల్గొన్నారు.