7 April, 2026 | 4:37 AM

జలాశయాలు డెడ్ స్టోరేజ్ : తాగునీటికీ కటకట!

07-04-2026 02:59 AM

చిన్న, మధ్యతరహా ప్రాజెక్టుల్లో ఆందోళనకర స్థితి రుతుపవనాలు ఆలస్యమైతే పరిస్థితి మరింత అధ్వానం

  1. తక్షణ నీటి నియంత్రణ కోసం అధికారుల చర్యలు 

ఏపీ జల దోపిడీనీ కట్టడిచేయాలంటున్న నిపుణులు

హైదరాబాద్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): రోజురోజుకూ వేసవి తీవ్రత పెరుగుతుండటంతో రాష్ట్రంలోని ప్రధాన, చిన్న, మధ్య తరహా జలాశయా లపై ప్రభావం పడుతున్నది. ఆయా ప్రాజెక్టుల్లోని నీటి నిల్వలు వేగంగా డెడ్ స్టోరేజ్ దిశకు చేరుతున్నాయి. అయితే ప్రాజెక్టుల్లో తగ్గుతున్న నీటి నిల్వలు తాగునీటి సరఫరాకు సవాళ్లు విసురుతున్నాయి. అంతేకాదు, సాగునీరు.. హైడల్ విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.

కీలక ప్రాజెక్టుల్లో పడిపోతున్న నీటి మట్టాలు డెల్టా వ్యవస్థ లపై ఒత్తిడిని పెంచగా, రైతాంగంపై మరింత ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో అంతర్రాష్ట్ర జల వినియోగంపై వివాదాలు ముదురుతూ, ఏపీ నీటి వినియోగంపై ఆందోళనలు వ్యక్తమవు తున్నాయి. రుతుపవనా లు ఆలస్యమైతే లేదా తక్కువ వర్షపాతం నమోదైతే పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో, తాగునీటి భద్రత కూడా ప్రశ్నార్థకం గా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో నీటి వినియోగంపై కట్టుదిట్టమైన నియంత్రణలు, రియల్‌టైమ్ మానిటరింగ్, అత్యవసర నిర్వహణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నా రు. మొత్తంగా, తగ్గుతున్న నిల్వలు, పెరుగుతున్న అవసరాల మధ్య రాష్ట్రం తీవ్రమైన నీటి సంక్షోభం అంచున నిలిచిందని స్పష్టమవుతోంది. 

రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో నీటి మట్టాలు గణనీయంగా పడిపోతూ ఆందోళన కలిగిస్తున్నాయి. తాజా గణాంకాలు చూస్తే, అనేక కీలక ప్రా జెక్టులు సగానికి దిగువ స్థాయికి చేరుకుని, డెడ్ స్టోరేజ్ దిశగా కదులుతున్నాయి. కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రధా న ప్రాజెక్టుల్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టులో మొత్తం 215.81 టీఎంసీల సామర్థ్యానికి ప్రస్తుతం 43.75 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉండటం గమనార్హం.

నాగార్జునసాగర్‌లో 312.05 టీఎంసీ లకు 176.06 టీఎంసీలు మాత్రమే మిగిలి ఉన్నా యి. ఉత్తర తెలంగాణకు కీలకమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం తీవ్రంగా పడిపోయి, 80.50 టీఎంసీలలో కేవలం 28.85 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. నిజాంసాగర్‌లో 17.80 టీఎంసీలకు 9.54 టీఎంసీలు, సింగూర్‌లో 29.91 టీఎంసీలకు 7.46 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నా యి.

జూరాల వంటి ప్రాజెక్టుల్లో కూడా నీటి మట్టాలు సగానికి దిగువకు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం 9.66 టీఎంసీల సామర్థ్యానికి గాను కేవలం 4.71 టీఎంసీ లు మిగిలి ఉన్నాయి. సాగునీటి అవసరాలు అధికమవడంతో, ప్రాజెక్టుల నుంచి భారీగా నీటి విడుదలలు కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం, గోదావరి డెల్టా వ్యవస్థ ద్వారా ఇప్పటివరకు 4881.11 టీఎంసీల వినియోగం నమోదైంది.

కృష్ణా డెల్టాలో కూడా ప్రధాన కాలువల ద్వారా పెద్దఎత్తున నీటి విడుదలలు కొనసాగుతున్నాయి. రబీ పంటల చివరి దశలో డెల్టా ప్రాంతాల్లో నీటి అవసరం ఎక్కువగా ఉండటంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి జలా శయాల నుంచి విడుదలలు పెరిగాయి. ఈ కారణంగా ఆ ప్రాజెక్టుల్లో నిల్వలు వేగంగా తగ్గుతున్నాయి. డెల్టా సాగు అవసరాలు తీరుస్తూనే, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలను నిలబెట్టడం అధికారులకు సవాలుగా మారింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, పైభాగ జలాశయాలు త్వరగా కనిష్ట స్థాయికి చేరే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

రుతుపవనాలు కీలకం..

రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న నీటి పరిస్థితుల నేపథ్యంలో రాబోయే రుతుపవనాలు అత్యంత కీలకంగా మారింది. రుతుపవ నాలు సమయానికి రాకపోతే లేదా తక్కువ వర్షపాతం నమోదైతే పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరి స్తున్నారు. ముఖ్యంగా డెడ్ స్టోరేజ్ దిశగా సాగుతున్న ప్రాజెక్టులు పూర్తిగా కనిష్ట స్థాయికి చేరే అవకాశం ఉంది. రుతుపవనాలు ఆలస్యమైతే సాగునీటి సరఫరా మరింత కష్టమవు తుంది, తాగునీటి నిర్వహణ పెద్ద సవాలుగా మారుతుంది. ఈ నేపథ్యంలో, రుతుపవనాలు సకాలంలో, సమృద్ధిగా కురవడం తప్ప పరిస్థితిని మార్చే మరో మార్గం కనిపించడం లేదు.

అయితే, రుతుపవనాలు సాధారణంగా కురిసినా కూడా, ప్రస్తుతం ఉన్న లోటును పూడ్చ డానికి సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీంతో ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నీటి వినియోగంపై కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. ము ఖ్యంగా అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించేందుకు ప్రాధాన్యత క్రమాన్ని అమలు చేస్తున్నా రు.

మొదట తాగునీటి అవసరాలను తీర్చే విధంగా చర్యలు తీసుకుంటూ, ఆ తరువాత మాత్రమే సాగునీటి విడుదలపై నిర్ణయాలు తీసుకుంటున్నారు. జలాశయాల నుంచి నీటి విడుదలలను పర్యవేక్షిస్తూ, అవసరానికి తగ్గట్టే నీటిని విడుదల చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా, అధిక వినియోగాన్ని నియంత్రించేందుకు కాలువల ద్వారా సరఫరాను కూడా సమీక్షిస్తున్నారు.

చిన్న, మధ్య తరహా ప్రాజెక్టుల్లో నిల్వలు తగ్గిపోవడంతో, వాటి వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించా రు. అవసరమైతే ప్రత్యామ్నాయ నీటి వనరులను వినియోగించే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు. ఇక రుతుపవనాలు వచ్చే వరకు అందుబాటులో ఉన్న నీటిని జాగ్రత్తగా వినియోగించాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని విభాగాల సమన్వయంతో నీటి నిర్వహణపై దృష్టి పెట్టారు.

ఏపీ దోపిడీని కట్టడి చేయాల్సిందే..

రాష్ట్రంలోని జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోతున్న నేపథ్యంలో ముందున్న రోజులు నీటి నిర్వహణకు కఠిన పరీక్షగా మారనున్నాయి. రబీ సీజన్ చివరిదశలో నీటి డిమాం డ్ ఎక్కువగా ఉండటంతో, పరిమిత నిల్వలతో రైతులకు సరిపడా నీరు అందించడం కష్టసాధ్యమవుతోంది. దీనికితోడు నగరాలు, గ్రామా లకు నిరంతర నీటి సరఫరా కొనసాగించడం కోసం ప్రాధాన్యత క్రమాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. నిల్వలు మరింత తగ్గితే, నీటి సరఫరా నియంత్రణ చర్యలు తప్పనిసరి అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అంతర్‌రాష్ట్ర జల వినియోగంపై కొత్త చర్చ మొదలైంది.

ముఖ్యంగా ఏపీ వైపు నుంచి జరుగుతున్న అదనపు నీటి వినియోగాన్ని (జల దోపిడీగా ఆరోపణలు) కట్టడి చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తు న్నారు. ఈ సమయంలో భాగస్వామ్య నదీ జలాలను ఒప్పందాల ప్రకారం వినియోగించకపోతే, పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉందని అంటున్నారు. ప్రత్యేకంగా దిగువ రాష్ట్రంగా ఉన్న ఏపీ, అనుమతించిన పరిమితికి మించి నీటిని వినియోగిస్తోందన్న ఆరోప ణలు తరచూ వినిపిస్తున్నాయి.

దీనివల్ల పైభాగంలోని జలాశయాల నిల్వలపై ప్రభావం పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో అంతర్‌రాష్ట్ర జల ఒప్పందాలను కచ్చితంగా అమలు చేయాలి, నదీ జల వినియోగంపై రియల్టైమ్ మానిటరింగ్ పెంచాలి, కేంద్ర జల సంఘం పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలి, అవసరమైతే న్యాయపరమైన చర్యలకు కూడా వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక నీటికొరత తీవ్రత దృ ష్ట్యా, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునే దిశగా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు. 

తాగునీటి, విద్యుతుత్పత్తిపై ప్రభావం.. 

జలాశయాల్లో నీటి మట్టాలు పడిపోతున్న నేపథ్యంలో తాగునీటి భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా నగరాలు, పట్టణాలకు నీటి సరఫరా చేసే ప్రధాన ప్రాజెక్టుల్లో నిల్వలు తగ్గిపోవడం పరిస్థితిని క్లిష్టంగా మార్చుతోంది. సింగూర్, నిజాంసాగర్ వంటి జలాశయాలు తాగునీటి అవసరాలకు కీలక ఆధారాలు. అయితే వీటిలో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోవడంతో, రాబోయే రోజుల్లో సరఫరాలో అంతరాయాలు ఏర్పడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

ప్రస్తుతం సాగునీటి అవసరాలు ఎక్కువగా ఉండటంతో, అందుబాటులో ఉన్న నీటిని అన్ని రంగాలకు సమానంగా పంపిణీచేయడం సవాలుగా మారిం ది. ఈ పరిస్థితిలో తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం పెరుగుతోంది. మరోవైపు, నీటి మట్టాలు మరింత తగ్గితే, పంపింగ్ ఖర్చులు పెరగడం, నీటి నాణ్యతపై ప్రభావం పడటం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

ముఖ్యంగా డెడ్ స్టోరేజ్ స్థాయికి చేరిన తర్వాత, శుద్ధిచేయడానికి అనువు కాని నీరు మిగిలే ప్రమా దం కూడా ఉంది. ప్రస్తుతం నీటినిల్వల పరిస్థితి కొనసాగితే, రాబో యే నెలల్లో తాగునీటి భద్రతపై స్పష్టమైన ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని స్పష్టమవుతోంది. ఈ పరిస్థితి హైడల్ విద్యుత్ ఉత్పత్తిపై కూడా చూపుతోంది. శ్రీశైలం వంటి ప్రధాన హైడల్ ప్రాజెక్టుల్లో నీటిలభ్యత తగ్గిపోవడంతో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం క్షీణించే పరిస్థితి కనిపిస్తోంది.

హైడల్ ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నీటి మట్టంపై ఆధారపడి ఉంటుంది. నీటిస్థాయి తగ్గిన కొద్దీ టర్బైన్ల ద్వారా విడుదలచేసే నీటి పరిమాణం తగ్గిపోతుంది. దీంతో ఉత్పత్తి తగ్గడమే కాకుండా, కొన్ని సందర్భాల్లో పూర్తిగా నిలిపివేయాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు. ప్రస్తుతం సాగునీటి, తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి రావడంతో, విద్యుత్ ఉత్ప త్తి కోసం నీటి వినియోగం పరిమితం అవుతోంది. ఈ కారణంగా విద్యుత్ రంగంపై పరోక్ష ఒత్తిడి పెరుగుతోంది. నీటిమట్టాలు మరింత తగ్గితే హైడల్ పవర్ ఉత్పత్తి గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉంది.

ఇదీ పరిస్థితి

ప్రాజెక్టు పేరు          సామర్థ్యం ప్రస్తుతం 

                               (టీఎంసీల్లో) 

ఆల్మట్టి                 129.72   41.34

జూరాల                      9.66          4.71

శ్రీశైలం                    215.81         43.75

నాగార్జునసాగర్    312.05        176.06

సింగూర్                     29.91           7.46

నిజాంసాగర్              17.80          9.54

శ్రీరాంసాగర్             80.50         28.85

మిడ్‌మానేరు              27.55         10.26

లోయర్ మానేరు       24.03          6.51

కడెం                       4.70          2.18

శ్రీపాద ఎల్లంపల్లి      20.18         11.68