7 April, 2026 | 3:06 AM

రెండేసి సార్లు ‘కల్యాణలక్ష్మి’ కటాక్షం!

07-04-2026 12:57 AM
  1. వరంగల్ జిల్లాలో భారీగా అక్రమాలు

కాగ్ నివేదికలో వెల్లడి

గ్రామ సభల్లో బయటపడ్డ అక్రమ భాగోతం

మహబూబాబాద్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): కళ్యాణ లక్ష్మి పథకంలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నట్లు భారత నియంత్రణ, లెక్కల పరిశీలన సంస్థ (కాగ్) గత నెలలో నివేదిక వెల్లడించింది. దీనికి తోడు ఇటీవల గ్రామాలు పట్టణంలో నిర్వహించిన గ్రామ సభలో లబ్ధిదారుల పేర్లు చదివి వినిపిస్తుండగా అక్రమాలు చోటు చేసుకున్నట్లు పలుచోట్ల ఫిర్యాదులు వస్తున్నాయి.

దీనితో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకం లో కొందరు అనర్హులకు రెండేసి సార్లు ‘కళ్యాణలక్ష్మీ’ కటాక్షం కురిపించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  కాగ్ నివేదిక ప్రకారం 201920 నుంచి 202122 మధ్య కాలంలో 7,300కి పైగా కేసుల్లో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకంలో నమోదు చేసిన వివాహ తేదీల కంటే ముందే గత ప్రభుత్వం అమలు చేసిన కేసీఆర్ కిట్ పథకంలో ప్రసవ తేదీలు నమోదైనట్లు గుర్తించారు.

ఈ వ్యత్యాసం డేటా ధృవీకరణలో తీవ్రమైన లోపాలను సూచిస్తోందని సీఏజీ పేర్కొంది. కొన్ని కేసుల్లో భర్త పేరు ఒకేలా ఉండటం వల్ల వివాహాలు అధికారికంగా ప్రకటించిన తేదీలకు ముందే జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేసింది. రూ.72.91 కోట్లు అక్రమంగా చెల్లింపులు జరిగినట్లు ఇటీవల కాగ్ నివేదికలో వెల్లడించింది. ఈ కేసుల్లో తప్పుడు వివాహ ధృవీకరణ పత్రాల ద్వారా లబ్ధి పొందినట్లు అనుమానం వ్యక్తమైంది. మొత్తంగా రూ.72.91 కోట్ల ఆర్థిక సహాయం అక్రమంగా చెల్లించినట్లు సీఏజీ పేర్కొంది.

ఇందులో 1,917 కేసులు రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల పరిశీలనలో గుర్తించబడి రూ.19.15 కోట్ల అక్రమ చెల్లింపులు వెలుగులోకి వచ్చాయి. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకంలో వధువు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా, కుల ధ్రువీకరణ పత్రం, వధువు వయస్సు ధ్రువీకరణ పత్రం,వివాహ ఆహ్వాన పత్రం, వివాహానికి సంబంధించిన ఫోటోలు, మ్యారేజి సర్టిఫికెట్ తదితర వివరాలతో ఆన్లైన్, మీసేవ, సిటిజన్ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేయవచ్చు.

ఆ విధంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వం ద్వారా వధువు కుటుంబానికి 1,00,016 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించబడుతుంది. అయితే 2019 నుంచి 22 వరకు 5,522 మంది అర్హులు కానివారు కూడా లబ్ధి పొందినట్లు గుర్తించారు. వీరిలో బాల్య వివాహాలు,

ఆదాయ పరిమితి దాటిన కుటుంబాలు, పథకం ప్రారంభానికి ముందే వివాహం చేసుకున్న వారు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఒకే వరుడితో పలువురు వధువుల పేర్లున్నట్లు కాగ్ గుర్తించింది. పథకంలో వధువులకు ఆధార్ ధృవీకరణ ఉన్నప్పటికీ వరులకు అలాంటి విధానం లేకపోవడం వల్ల ఒకే వ్యక్తికి అనేక క్లెయిమ్లు నమోదైనట్లు వెల్లడైంది. కొన్నిచోట్ల ఒకే వరుడికి ఇద్దరు వధువులు నమోదైన ఘటనలు బయటపడ్డాయి. రెండో వివాహాలకు విడాకుల పత్రాలు వంటి ఆధారా లు లేకపోవడం కూడా గుర్తించారు. అలాగే పథకం అమలు కోసం తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించినట్లు గుర్తించారు. 

కళ్యాణ లక్ష్మి అమలులో ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ అక్రమాలు

తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం అయిన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ అమలులో ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీగా అక్రమాలు జరిగినట్లు కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదికలో వెల్లడైంది. అనర్హులకు నిధుల మంజూరు, ఒకే వరుడికి పలువురు వధువుల పేర్లతో సాయం పొందడం, తప్పుడు వివరాలతో దరఖాస్తులు వంటి అనేక లోపాలు బయటపడ్డాయి.

కాగ్ నివేదిక ప్రకారం 2019-20, 2020-22 ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్రవ్యాప్తంగా 5,522 అనర్హులకు రూ.55.12 కోట్ల సాయం మంజూరు చేసినట్లు గుర్తించారు. వరుడి ఆధార్ ధృవీకరణ లేకపోవడంతో ఒకే వరుడికి పలువురు వధువులుగా చూపించి 676 కేసుల్లో రూ.3.38 కోట్లను విడుదల చేసినట్లు నివేదిక వెల్లడించింది. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 80కు పైగా అనుమానాస్పద కేసులు ఉన్నట్లు గుర్తించారు. 

మరిపెడలో మీసేవ నిర్వాహకుడి చేతివాటం?

మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఓ ‘మీసేవ’ నిర్వాహకుడు తప్పుడు మార్గాల్లో కల్యాణ లక్ష్మి పథకం అమలులో సిద్ధహస్తుడిగా పేరు గడించాడు. దొడ్డి దారిలో కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేయడానికి ముందుగానే ఓ రేటు మాట్లాడుకుని, అందుకు తగ్గట్టుగా తప్పుడు పత్రాలను సృష్టించి, దొడ్డి దారిలో అక్రమంగా కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకం ద్వారా పదుల సంఖ్యలో అనర్హులకు లబ్ధి చేకూర్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో ఆ మీసేవ నిర్వాహకుడు కూడా రెండుసార్లు కల్యాణ లక్ష్మి పథకాన్ని అందుపుచ్చుకున్నాడనే ప్రచారం సాగుతోంది. 

గ్రామ సభల్లో బయటపడ్డ అక్రమ భాగోతం

ఈనెల 2న రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలులో భాగంగా గ్రామాలు, మున్సిపాలిటీలోని వార్డుల్లో గ్రామసభలో నిర్వహించి ఇటీవలి కాలంలో ప్రభుత్వం నుండి వివిధ సంక్షేమ పథకాలను అందిపుచ్చుకున్న లబ్ధిదారుల పేర్లు చదివి వినిపిస్తుండగా, అక్రమంగా కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకం ద్వారా లబ్ధి పొందిన వారి పేర్లు విని, ఇవి తప్పుడుగా లబ్ధి పొందినట్లు అధికారులకు నివేదించారు.

విచారణ చేస్తున్నాం

కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకంలో అనర్హులైన లబ్ధిదారులపై ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణ చేపట్టినట్లు తహసిల్దార్ కృష్ణవేణి తెలిపారు. మరిపెడ మండలంలో ఒక మీసేవ వివాహకుడితోపాటు కళ్యాణ లక్ష్మి అక్రమంగా లబ్ధి పొందినట్లు ముగ్గురిపై ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. ఈ సంఘటనలపై విచారణ చేపట్టామని అయితే ‘మీసేవ’ తాత్కాలికంగా నిలిపివేయడం వల్ల వెంటనే చర్యలు చేపట్టలేకపోయామని, మీసేవ పునరుద్ధరించగానే విచారణ అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ చెప్పారు.

- కృష్ణవేణి, మరిపెడ తహసీల్దార్