గో ఆధారిత సాగుతో నేలకు పునరుజ్జీవం
సాంకేతికత పెరుగుతున్న కొద్దీ వ్యవసాయం చేసే పద్ధతులు మారిపోతున్నాయి. దేశంలో హరిత విప్లవం మొదలైన నాటి నుంచి అధిక దిగుబడి కోసం రసాయనాల వాడకం పెరుగుతోంది. దేశవాళీ పద్ధతులు పూర్తిగా మరుగునపడ్డాయి. రసాయనాలతో భూమి నిస్సారమవుతోంది. నేలలో సత్తువ తగ్గుతోంది. ఒకప్పుడు విస్తారంగా పంటలు పండిన నేలలు నేను బంజరుగా మారుతున్నాయి. కేవలం అధిక దిగుబడికే ప్రాధాన్యమిచ్చి మట్టిని పట్టించుకోవడం మనిషి మానేశాడు. అనారోగ్యాలకు కొని తెచ్చుకుంటున్నాడు. పూర్వీకులు దిగుబడికి ఎంత ప్రాధాన్యమిచ్చారో మట్టికి అందే విలువనిచ్చి సాగుచేశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.
భారతదేశంలో 100 ఏళ్లుగా పురుగుల మందు పేరుతో అనేక కృత్రిమ రసాయనాలు వాడుతున్న కారణంగా 12 అడుగుల లోతు వరకు భూమికి మేలు చేసే బ్యాక్టీరియా పూర్తి చనిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే మట్టి చనిపోయింది. ప్రస్తుతం దేశ జనాభా 140 కోట్లకు చేరింది. మనిషి కాకుండా 1,400 కోట్ల జీవరాశులు బతుకుతున్నాయి. మనుషులకు, జంతువులకు మట్టి నుంచే ఆహారం పుడుతుంది. వేల ఏళ్ల నుంచి భారత భూమిలో బంగారు పంటలు పండాయి. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ ఎంతో విభిన్నం. భారతీయుల జీవనవిధానం 80 శాతం వ్యవసాయంపైనే ఆధారపడి ఉంది. కానీ, ఆధునిక వ్యవసాయం, హరిత విప్లవాల పేరిట అధిక దిగుబడి కావాలనే దురాశతో మరో లక్ష ఏళ్లు ఫలాలు ఇవ్వాల్సిన నేలను అంతిమ దశకు చేర్చారు.
దేశ జనాభాలో అధిక శాతం వివిధ జబ్బులతో బాధపడుతుండటం గమనార్హం. ఇది ఎలాంటి అభివృద్ధికి చిహ్నం? ఈ రోజు పంజాబ్ రాష్ట్రంలో క్యాన్సర్ రోగుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఆ రాష్ట్రం దీనావస్థలో ఉంది. కిడ్నీ, లివర్, హార్ట్ ఫెయిల్యూర్, సోరియాసిస్, సంతానోత్పత్తి లోపాలు వంటి సమస్యలు పెరుగుతున్నాయి. వీటన్నింటికీ ప్రధాన కారణం 40 ఏళ్లుగా సైన్స్ పేరిట విచ్చలవిడిగా కృత్రిమ రసాయనాలతో నేలను విషపూరితం చేయడమే. ఆ రసాయనాలన్ని 95 శాతం ప్రమాదకరం. ఈ నేలల నుంచి పండిన గోధుమలు, వడ్లు సహా అన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్నాయి.
మనం తింటున్న ఆహారమే పైన చెప్పిన వ్యాధులకు మూలకారణం. ఆధునిక విజ్ఞానం పేరుతో రోగాలను మనమే సృష్టించుకుంటున్నాం. మన ఆనందాన్ని మన చేతులతోనే దూరం చేసుకుంటున్నాం. ఈ వ్యాధులకు సరైన మందులు ఇప్పటికీ లేవు. వ్యాధులు సోకిన తర్వాత కోట్లు ఖర్చు చేసినా ప్రాణాలు దక్కవు. ఒకప్పుడు మన దేశంలో బలిష్ఠంగా, ఆరోగ్యకరంగా ఉన్న ప్రజలు జీవించారని చరిత్ర చెబుతోంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మట్టిని నాశనం చేసి రోగాల బారిన పడుతున్నామని తెలిసినా ఇంకా మేలుకోవడం లేదు. కుప్పలు తెప్పలుగా వస్తున్న రోగాలతో జాతి నిర్వీర్యమవుతోంది. ఈ సృష్టిలో కోట్లాది ప్రాణులు మట్టిని కాపాడుకుంటూ వస్తుంటే మనుషులేమో అహంకారం, మూర్ఖత్వంతో దాన్ని నాశనం చేస్తున్నారు. అయినా మానవుడు కళ్లు తెరవడం లేదు.
కొత్త రోగాలు పుట్టుకొస్తుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చేసిన పరిశోధనలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. మట్టి విషమయమైందని, అందులో పండిన ఆహార పదార్థాలు తినడం వల్లే శరీరంలోని అవయవాలు ఫెయిల్ అవుతున్నాయని తేలింది. దీనికి పరిష్కారం మళ్లీ భూమిని తిరిగి మంచిగా మార్చుకోవడమేనని వెల్లడించింది. అందుకే మన మట్టిని మళ్లీ ఆరోగ్యవంతంగా మార్చడం మన ముందున్న కర్తవ్యం. కానీ, నేలలో పునరుజ్జీవం తెచ్చేందుకు ఎలాంటి పద్ధతులు వాడాలో డబ్ల్యూహెచ్‌ఓ తెలపలేదు. కానీ, దీనికి ఎప్పుడో మహాత్మగాంధీ పరిష్కారం చెప్పారు. ప్రకృతి, సేంద్రీయ, గో వ్యవసాయమే భూమిని కాపాడుతుందని గాంధీ తెలిపారు.
గోవు అంటే మళ్లీ జెర్సీ, హెచ్‌ఎఫ్ వంటి విదేశీ, సంకరజాతులు కాదు. భారతీయ గోవు. దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రకాల జీవ వైవిధ్యంతో బతికే 72 రకాల గో జాతులు ఉన్నాయి. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లోని ఒంగోలు గిత్త ప్రపంచ ప్రసిద్ధి చెందింది. అత్యంత భారీగా, ఆకర్షణీయంగా ఉంటుంది దీని ఆకారం. చిత్తూర్ జిల్లాలో కనిపించే పుంగనూరు రకం చిన్న పరిమాణంలో ఉంటుంది. అదేవిధంగా గుజరాత్‌లోని గిర్, రాజస్థాన్‌లోని రాఠి, కాంక్రోచ్, తార్‌పార్కర్, సాయివాల్, దేవల్ వంటి దేశవాళీ రకాలు ఉన్నాయి. దేశవాళీ ఆవుల్లో ప్రత్యేకమైన రసాయనిక చర్యలు జరుగుతాయి. ఇవి 100 శాతం బ్యాక్టీరియా సహకారంతో జీవిస్తాయి. పూర్తిస్థాయి భారతీయ గోవును గుర్తించే లక్షణాలు ఇవి..
1. భారతీయ గోవుకు మూపురం ఉంటుంది.
2. గోవుకు గంగడోలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.
3. గోవు ముందు కాళ్లు మూపురానికి సరిగ్గా 90 డిగ్రీలు ఉంటుంది.
4. ప్రధానంగా ఆవు తన శరీరంలో పుష్కలంగా మానవాళికి సరిపడే కార్పోహైడ్రేట్లు, పైబర్, కాల్షియం, సోడియం, ఐరన్, జింక్, బీ విటమిన్, ఒమెగా ఉంటాయి.
గోమూత్రం మట్టికి ఆరోగ్యం. అది నేలకు పునరుజ్జీవం కలిగిస్తుంది. ఆవు పాలతో మానసికంగా, శారీరకంగా మానవుడు ఆరోగ్యవంతుడవుతాడు. మూపురం ద్వారా సూర్యుని కిరణాల్లోని విలువైన, శాస్త్రీయంగా సుస్థిరమైన సన్ రేస్‌ను గ్రహిస్తుంది. సాధారణంగా ఉదయం ఎండకు నిలబడితే మనుషులకు డీ విటమిన్ లభిస్తుంది. కానీ, ఆవులకు మాత్రమే శక్తిమంతమైన కిరణాలను స్వీకరించే శక్తి ఉంది. అందుకే ఆధునిక వైద్యులు, శాస్త్రవేత్తలు ఆవు పాలు తాగండని సూచిస్తున్నారు.
వ్యాసకర్త: గోసాయి రాజన్న,
అండాళ్ గోషాల, కంట్లూర్,
ఫోన్ నెంబర్: 9494151919






