4 May, 2026 | 10:13 AM

కాకతీయ చరిత్రకు సిసలైన వారసుడు

31-05-2024 12:05 AM

సుమారు 70సంవత్సరాల క్రితం నాటి మాట. వరంగల్లు నగరం. అప్పటికి చిన్న పట్టణమే. ప్రస్తుతం ఉన్న హన్మకొండ ఇప్పటంతగా అభివృద్ధి చెందినదేమీ కాదు. ఇక, కాజీపేట అంటే రైల్వే స్టేషన్, పోలీస్ స్టేషన్, భవానీ టాకీస్, డాక్టర్ విశ్వనాథరావు దవాఖాన. ఇంతకు మించి ఇండ్లు చాలా తక్కువే. వరంగల్ అంటే భద్రకాళి గుడి దాటిన తరువాత ఎంజీఎం దగ్గర నుంచి రంగశాయిపేట, ఖిలా వరంగల్ వరకు ఉన్న ప్రాంతమే. ఎక్కడ పడితే అక్కడ అడవి, గుట్టలు, మట్టి రోడ్లు తప్ప మరేమీ లేని పెద్ద పట్టణం. అక్కడ పెద్దగా ఇండ్లు లేని హన్మకొండ లష్కర్ బజార్‌లోని ఒకానొక ఇంట్లో ఒక ఇంగ్లిష్ మాష్టారు ఉండేవారు. కోమటి శ్రేష్టి చందాకాంతయ్య స్థాపించిన ఏవీవీ హైస్కూలులో ఉద్యోగం. రోజూ పాఠశాలకు వెళ్లడం, పాఠాలు చెప్పడం ఆయన డ్యూటీ. కానీ, ఆయనకు అంతకు మించి ఒక విలక్షణమైన అలవాటు ఉండేది. తెల్లవారుతుండగానే సైకిల్ తీసుకొని బయలు దేరాలి.

కనిపించిన గుడికల్లా వెళ్లాలి. ఎక్కదగిన గుట్టలనల్లా ఎక్కాలి. అక్కడి గోడలు చూడాలి. శిల్పాలను చూడాలి. వాటిని ఎవరు కట్టారు? ఎలా కట్టారు? ఎంతకాలం కట్టారు? దాని వెనుక ఉన్న మతలబు ఏమిటి? నిర్మాణ శైలి ఏమిటి? ఇవన్నీ అధ్యయనం చేయాలి. తర్వాత ఇంటికొచ్చి ఆ వివరాలను భద్రంగా డైరీలో రాసుకోవాలి. ఆయన సైకిల్‌పై బయలుదేరి కొంతదూరం వెళ్లగానే పద్మాక్షమ్మ గుట్ట కనిపించేది. గుట్టపైకి చేరుకున్నాక అక్కడ పద్మాక్షుడు, జైన తీర్థంకరులు, సిద్ధులు దర్శనమిచ్చేవారు. సిద్ధేశ్వరుడి శిల్పం గురించి అధ్యయనం చేసేవారు. ఆ తరువాత అక్కడ్నించి బయలుదేరి పక్కనే ఉన్న వెయ్యి స్తంభాల గుడికి చేరుకొనే వారు.

అక్కడ ఒక వాచ్‌మ్యాన్ ఉండేవారు. అతని పేరు మల్లయ్య. ఇద్దరూ కలిసి గుడి అంతా కలియ దిరిగేవారు. గుడి ఎదురుగా ఉన్న నాట్య మండపాన్ని పరికించి చూసేవారు. అక్కడి రుద్రదేవుడి శాసనాన్నీ చూసి, పక్కనే ఉన్న కోనేటి గట్టుపై కూర్చొని ముచ్చట్లు పెట్టుకొనేవారు. ఆ మల్లయ్య గుడికి సంబంధించిన కథలను జానపద కళారూపాల్లో చిత్రవిచిత్రంగా వివరిస్తుంటే వాటిని వింటూ, ఆకళింపు చేసుకుంటూ, మనసున పట్టించుకుంటూ, ఆహ్లాదంగా గడిపే వారు. ఆయన దెందుకూరి సోమేశ్వరరావు. ప్రభుత్వ డిగ్రీ లేని చరిత్రకారుడు. తాను నిర్వహించిన వృత్తిని మించి కాకతీయుల చరిత్రను సంపూర్ణంగా అధ్యయ నం చేసిన చరిత్ర పరిశోధకుడు. 

దెందుకూరి సోమేశ్వరరావు 1924 మే 31 న జన్మించారు. 2024 మే 31న ఆయ న శత జయంతి వేడుకలు జరుగుతున్నా యి. ప్రభుత్వం కానీ, సమాజం కానీ ఆయనకు ఇవ్వాల్సినంత గుర్తింపు ఇవ్వలేదు. కాకతీయుల చరిత్రను గురించి ఆయన చేసిన పరిశోధన బహుశా చరిత్రకారులు ఎవరూ చేయలేదేమో. కాకతీయ సంచికను వెలువరించిన మారేమండ రామారా వు కానీ, ఓరుగల్లు చుట్టుపక్కల శాసన పరిశోధన చేసి అనేక శాసనాలను డీకోడ్ చేసిన దూపాటి వెంకటరమణా చార్యులు కానీ, సోమేశ్వరరావు వెళ్లినంత లోతుగా కాకతీయుల చరిత్రలోకి వెళ్లలేదేమో. 

వరంగల్ కోట విశేషాలు

ఈ రోజు మనం వరంగల్ కోటలోకి ప్రవేశించగానే మనకు కోట ఏ విధంగా నిర్మించారు, కోటలో ఏ ప్రదేశం ఎక్కడెక్కడ ఉన్నదీ, రాతి కోట, మట్టికోట ఇలా ఏడు కోటల ప్రహరీలు, మధ్యలో కాకతీయ రాజమందిరం ఎలా ఉండేవో, సూచిస్తూ ఒక పెద్ద బోర్డు ముందుగా దర్శనమిస్తుంది. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వారు ఈ చిత్రాన్ని గీసి అక్కడ పెద్ద బోర్డుపై ఏర్పాటు చేశారు. వరంగల్ కోటను చూడటానికి వచ్చే యాత్రికులకు ఈ చిత్రం చాలా విషయాలు తెలుసుకోవడానికి దోహద పడుతుంది. దీనికి మూలం సోమేశ్వరరావు మాష్టారు గీసిన చిత్రమే. కొన్ని నెలలపాటు ఆయన కాకతీయ కోట చుట్టూ కాలికి బలపం కట్టు కొని మరీ తిరిగారు.

అంగుళమంగుళం పరికించారు. ప్రతి శిల్పాన్నీ, దాని వైదుష్యాన్నీ గమనించారు. అక్కడితో ఆగలేదు. కాకతీయ చరిత్రకు సంబంధించి అందుబాటులో ఉన్న సాహిత్యాన్నంతా చదివా రు. ఒక్కొక్కటీ డైరీలో నోట్ చేసుకొన్నారు. ఆ తరువాత, కాకతీయు కోట స్వరూప స్వభావాలను చిత్ర రూపంలో గీశారు. సోమేశ్వరరావు కేవలం ఆంగ్లోపన్యాసకుడే కాకుండా చిత్రకారుడు కూడా. కోట గోడలు, వాటిమీది తోరణాలు, దర్వాజాలు, నిర్మాణ విభేదాలు, వినుకొండ వల్లభరాయుని క్రీడాభిరామంలో వర్ణించిన వరంగల్లు మహానగర రూపురేఖలు, ఇండ్ల నమూనాలను కూడా ఆయన చిత్రించి పెట్టారు. కోటకు ఇవతల కనిపించే కరీమాబాద్, రంగశాయిపేట వంటివన్నీకూడా కోటలో భాగంగానే ఉండేవనీ ఆయన చెప్పేవారు. కోటను ఆనుకొని ఉన్న ఖుష్‌మహల్, ఆ పక్కనే ఉన్న స్వయంభూ శంభుని గుడి, అందులోని ఏకశిల శివలింగం, నంది గురించి ప్రత్యేకంగా రాశారు. 

ప్రసన్న వదనగా మారిన భద్రకాళి!

కాకతీయులు పూజించిన కాకతి ఈనాటికీ భద్రకాళిగా పూజలు అందుకొంటున్న ది. ఇవాళ మనకు దర్శనమిస్తున్న అమ్మవారు ప్రసన్న వదన. కానీ, ఆరు దశాబ్దాల క్రితం అమ్మవారు ఉగ్రరూపంలో ఉండేది. ఆ ఉగ్రరూపాన్ని చూసిన వారు చాలామందే ఉన్నారు. అప్పుడు భద్రకాళి అమ్మవారు చెరువు గట్టున దట్టమైన అడవిలో ఉన్నట్టుగా ఉండేది. దారిలో సింహాద్రి గుట్ట ఒక్కటే కనిపించేది. ఆ అమ్మవారి రూపాన్ని చూసి ప్రజలు భయపడుతుండటంతో ఆమెను తరువాతి కాలంలో ప్రసన్న వదనగా మార్చారు. ఆ ఉగ్రరూప కాళి నమూనాలో ఉన్న మరో శిల్పాన్ని వరంగల్ మ్యూజియంలో మనం చూడవచ్చు. 

పునర్నిర్మాణం ఎప్పుడు?

వేయి స్తంభాల గుడి నిర్మాణంలోని శాండ్ టెక్నాలజీని మొదట గుర్తించింది సోమేశ్వర రావే. గుడిలోని నాట్యమండపం ఒకపక్క ఒరిగి పోతున్నప్పుడు దాన్ని తొలగించి తిరిగి నిలబెట్టాలని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం ఇంటాక్, వరంగల్ ఆర్‌ఈసీ (ఇప్పుడు నిట్) ఇంజనీర్లను సంప్రదించి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రయత్నాన్ని సోమేశ్వరరావు తీవ్రంగా వ్యతిరేకించారు. అత్యంత పురాతనమైన కట్టడాన్ని పూర్తిగా విప్పి అదే విధంగా తిరిగి నిలబెట్టడం సాధ్యం కాదని, ఉన్న నిర్మాణాన్ని పూర్తిగా పడిపోకుండా ఇతర ప్రయత్నాలు చేయాలని సూచించారు. వెయ్యేండ్ల నిర్మాణాన్ని తాము వందేండ్ల గ్యారంటీతో నిర్మిస్తామని అనడాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు. కానీ, అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. సోమేశ్వరరావు భయపడినట్టే జరిగింది. 

ప్రభుత్వం నాట్య మండపం స్తంభాలన్నీ విడదీసి తిరిగి నిర్మాణాన్ని చేపట్టాలని భావించింది. పూర్తి చేయడానికి దాదాపు ఒకటిన్నర దశాబ్దం పైనే పట్టింది. ఈ మధ్య కాలంలో కొన్ని అద్భుత శిల్పాలున్న స్తంభాలు మాయమైపోయాయి. చివరకు కొత్తగా రాళ్లు తెప్పించి వాటితో కొన్ని స్తంభాలు, శ్లాబులు తయారు చేసి మొత్తం మీద పూర్తయిందనిపించారు. అంతకు ముందు జాకారం దగ్గర మరో కాకతీయుల గుడిని కూడా విడదీసి పెట్టారు. రెండు దశాబ్దాలైనా సరే, దాని పునర్నిర్మాణం ఊసే లేకుండా పోయింది. 

చారిత్రక ప్రదేశాల్లో ఎక్కడైనా అద్భుత శిల్పాలు ఉంటే వాటిని అక్కడే ఉంచి రక్షించే ఏర్పాట్లు చేయాలని, వాటికి స్థానచలనం కల్పిస్తే వాటి అస్తిత్వమే పోతుంద ని, వాటి చారిత్రక ప్రాధాన్యం తగ్గిపోతుందని సోమేశ్వరరావు దృఢంగా విశ్వసించే వారు. వరంగల్లులోని కొండపర్తి గ్రామంలోని గుట్టపైన ఏడెనిమిది అడుగుల ఎత్తయిన ఒక రాజు విగ్రహం ఉండేది. తలకు పాగా చుట్టుకొని, అద్భుతంగా నిలబడి ఉన్న విగ్రహమది. దాన్ని వరంగల్ మ్యూజియంకు తరలించాలని ప్రయత్నించినప్పుడు సోమేశ్వరరావు అడ్డుకొన్నారు. కానీ, అధికారులు తరలించడానికే మొగ్గు చూపారు. తీరా కదిలించేసరికి సరిగ్గా నడుము భాగంలో విగ్రహం రెండుగా విరిగిపోయింది. ఆ ముక్కలనే తీసుకొచ్చి మ్యూజియంలో ఉంచారు. ఇవాళ మ్యూజియంకు వచ్చేవారు లేరు. కొండపర్తి ప్రాధాన్యమూ పోయింది. 

కాకతీయ చరిత్రకు చిరునామా

వరంగల్ ఉర్సు గుట్టపై ఒక శాసనం ఉన్నది. నృసింహ కవి అనే ఆయన ఈ రాతిపై ఏకంగా ఒక కావ్యాన్నే రచించారు. పీవీ పరబ్రహ్మశాస్త్రి దాన్ని ‘సిద్ధోద్వాహము’ అన్న పేరుతో ప్రజల్లోకి తీసుకొచ్చారు. ఇది గొప్ప ప్రేమ కావ్యం. కాళిదాసు ‘మేఘ సందేశం’ స్థాయికి చెందిందని సాహిత్యకారులు చెప్తుంటారు. ఈ శాసనాన్ని అధ్యయనం చేసేందుకు సోమేశ్వరరావు తన విద్యార్థులను సైకిల్‌పై ఎక్కించి తీసుకొని వెళ్లి దాని ప్రాశస్త్యాన్ని చెప్పి మరీ పరిశోధనకు ప్రోత్సహించారు. ఒక విధంగా కాకతీయ చరిత్రకు కేరాఫ్‌గా సోమేశ్వరరావు ప్రసిద్ధి చెందారు. ఇంటాక్ అయినా, సర్వే ఆఫ్ ఇండియా అయినా, శాసనకర్తలైన రాధాకృష్ణమూర్తి, పీవీ పరబ్రహ్మశాస్త్రి, బీ రామరాజు.. ఇలా ఎందరెందరో కాకతీయులను అధ్యయనం చేయాలంటే ముందుగా మాట్లాడాల్సింది సోమేశ్వరరావుతోనే! ఆ తరువాతే పరిశోధన ముందుకు సాగేది. 

500 దేవాలయాలపై అధ్యయనం

వరంగల్ చుట్టు పక్కల ఉన్న దాదాపు 500 దేవాలయాలను సోమేశ్వరరావు సమగ్రంగా అధ్యయనం చేశారు. ఆయా శిల్పాలు ఎలా ఉన్నాయి? వాటిని అలా శిల్పీకరించడంలోని ఆంతర్యం ఏమిటో కూడా ఆయన పరిశోధించారు. ఖిలా వరంగల్‌లో కొంగు కప్పుకొని ఉన్న స్త్రీ రూపాన్ని ఆయన చూశారు. అప్పుడప్పుడే ముస్లిం రాజుల ప్రవేశం జరుగుతున్న కాలంలో స్త్రీలకు పరదా పద్ధతి రావటానికి సంకేతంగా ఆ శిల్పాన్ని ఆయన వర్ణించారు. వరంగల్ కాకతి విగ్రహాన్ని గురించి ఆయన ప్రత్యేకంగా పరిశోధించారు. అది ప్రస్తుతం హైదరాబాద్‌లోని నల్లకుంటలో ఒకరి ఇంట్లో ఉన్నదని సమాచారం. ఈ కాకతి అమ్మవారికి ముంగిస వాహనంగా ఉన్నదని చెప్పారు. రామప్ప దేవాలయానికి సంబంధించి రెండు అడుగుల పొడవైన తేలికపాటి ఇటుకలను సేకరించి వాటి ప్రాధాన్యాన్ని గుర్తించి, నీటిమీద తేలియాడేంత తేలికైన ఇటుకల టెక్నాలజీని సోమేశ్వరరావు అధ్యయనం చేశారు. వీటిని తాము పరిశోధించి, పరిశీలిస్తామని ఆనాటి ఆర్‌ఈసీ పరిశోధకులు ఈయన దగ్గరి నుంచి తీసుకెళ్లి పోయారు. పరిశోధన జరిగిందో లేదో తెలియదు.  

అద్భుత చిత్రకారుడు

సోమేశ్వరరావులో ఉన్న మరో కోణం చిత్రకళ. ఆయన గొప్ప చిత్రకారుడు కూడా. బమ్మెర పోతనకు ఒక రూపాన్నం టూ తొలుత ఇచ్చింది సోమేశ్వరరావే. ఆ తరువాతే కొండపల్లి శేషగిరిరావు పోతన చిత్రాన్ని వేశారు. సోమేశ్వరరావు వేసిన చిత్రం ప్రస్తుతం వరంగల్ ‘పోతన విజ్ఞాన పీఠం’లో ఉన్నది. వరంగల్‌లో ప్రతిష్ఠాత్మకమైన కాకతీయ యూనివర్సిటీ అధికారిక ముద్ర (సింబల్)ను రూపొందించింది కూడా ఈయనే. ఆ యూనివర్సిటీలోని ఆంగ్లశాఖ కోసమంటూ ప్రఖ్యాత రచయిత షేక్ స్పియర్ లైఫ్ సైజ్ చిత్రాన్ని గీసి బహుమతిగా ఇచ్చారు. మనం ఇవాళ ప్రముఖం గా చూసే ప్రతాపరుద్రుడి తల చిత్రం గీసింది కూడా సోమేశ్వరరావే. ఒకటా రెండా, సోమేశ్వరరావు గురించి ఎంత చెప్పినా, ఎంత రాసుకున్నా తనివి తీరదు. ఒక్కమాటలో చెప్పాలంటే, మనం మరచిపోయిన చరిత్రకారుడు సోమేశ్వరరావు. ప్రభుత్వం గుర్తించకపోయినా, మే 31న మాష్టారు శతజయంతి సందర్భంగా వారికి వినమ్ర నివాళి.


 -కోవెల సంతోష్ కుమార్

సెల్: 9052116463