భూసార పరీక్షలు తప్పనిసరి
రైతులకు సర్పంచ్ దండేవేన సంధ్య బానేష్ సూచన
మంథని,(విజయక్రాంతి): రైతులు సాగులో లాభాలు గడించాలంటే భూసార పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరమని, అలాగే పంట మార్పిడి పద్ధతులను తప్పనిసరిగా పాటించాలని గుంజపడగు గ్రామ సర్పంచ్ దండేవేన సంధ్య బానేష్ అన్నారు. సోమవారం మంథని మండలం గుంజపడగు గ్రామంలో రైతుల సౌకర్యార్థం నిర్వహించిన భూసార పరీక్షా మేళాలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... ప్రతి రైతు ఏడాదికి ఒకసారి తమ పొలంలోని మట్టిని పరీక్ష చేయించుకోవాలని సూచించారు. భూమి ఆరోగ్యాన్ని, సారవంతాన్ని కాపాడుకోవడానికి రసాయన ఎరువుల వాడకం తగ్గించి, సేంద్రీయ ఎరువులు, పశువుల పేడ, వానపాముల ఎరువులను వినియోగించాలని కోరారు. పంట మార్పిడి చేయడం వల్ల భూమి సారం దెబ్బతినకుండా ఉండటమే కాకుండా, తెగుళ్ల ఉధృతి కూడా తగ్గుతుందని రైతులకు వివరించారు.






