పిడుగుపాటుకు గురై గొర్రెల కాపరి మృతి
23-06-2026 08:56 PM
చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండల పరిధిలోని వట్టిమర్తి గ్రామంలో పిడుగుపాటుకు గురై ఓ గొర్రెల కాపరి మృతి చెందిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... వట్టిమర్తి గ్రామానికి చెందిన సంక బుడ్డి నాగరాజు (32) సోమవారం మధ్యాహ్నం దాడి శ్రీనివాస్‌కు చెందిన వ్యవసాయ భూమిలో గొర్రెలు మేపుతున్న సమయంలో అకస్మాత్తుగా పిడుగు పడింది. దీంతో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య సంక బుడ్డి మాధురి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు చిట్యాల ఎస్సై ఎం. రవికుమార్ తెలిపారు. నాగరాజు మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.






