5 August, 2026 | 12:34 PM

అండమాన్ చేరిన నైరుతి

20-05-2024 01:50 AM

రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్..

31 నాటికి కేరళ చేరే అవకాశం

తెలంగాణలోకి సమయానికే రుతుపవనాలు

రాష్ట్రంలో మరో  ౩ రోజులు వర్షాలు

వాతావరణ విభాగం వెల్లడి

న్యూఢిల్లీ/హైదరాబాద్, మే 19: భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఆదివారం అండమాన్ నికోబార్ దీవులకు చేరాయని ప్రకటించింది. ‘నైరుతి రుతుపవనాలు మాల్దీ వుల్లోని కొన్ని ప్రాంతాలతోపాటు బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయి’ అని ఆదివారం వెల్లడించింది. ఈ నెల 31 నాటికి కేరళ తీరాన్ని తాకుతాయని పేర్కొన్నది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు మే 31 లేదా జూన్ ఒకటో తేదీన కేరళ తీరాన్ని తాకుతాయి.

కొంతకాలంగా ఈ పరిస్థితుల్లో మార్పు వస్తున్నది. జూన్ మొదటి, రెండోవారంలో కూడా కేరళకు చేరిన సందర్భాలున్నాయి.  గత 150 ఏండ్ల లెక్కలు తీసుకొంటు అత్యంత ముందుగా 1918లో మే 11వ తేదీనే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. అత్యంత ఆలస్యంగా 1972లో జూన్ 18న వచ్చాయి. నైరుతి రుతుపవనాల వల్లనే దేశంలో 70 శాతం వర్షపాతం నమొదవుతుంది. గత సంవత్సరం రుతుపవనాలు కేరళను జూన్ 8న చేరుకొన్నాయి. 2022లో మే 29వ తేదీనే చేరాయి. 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న భారత ప్రధాన భూభాగాన్ని తాకాయి. 

పుష్కలంగా వర్షాలు

వచ్చే వానకాలంలో వానలు సమృద్ధిగానే పడుతాయని ఐఎండీ ప్రకటించింది. దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో సాధారణంకంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని, కొన్ని ప్రాంతాల్లో మాత్రం కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నదని పేర్కొ న్నది. దేశంలో ప్రస్తుతం చాలాప్రాంతాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. అనేకచోట్ల తీవ్ర వడగాల్పులు, ఎండలు మండి పోతున్నాయి. ఈ నేపథ్యంలో నైరుతి రుతుపవనాలు సమాయానికే వస్తాయని ఐఎండీ ప్రకటించటంతో రైతన్నల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. 

రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు

రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం తెలిపింది. 19 జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగిన ఆవర్తనం బలహీనపడుతున్నదని తెలిపింది. రాష్ట్రంలో ఆదివారం కూడా పలుచోట్ల వర్షాలు కురిశాయి.

సూర్యాపేట జిల్లాలోని నడిగూడెంలో 64.3 మిల్లీమీటర్లు, సంగారెడ్డి జిల్లాలోని రామచం ద్రాపురంలో 45.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది. హైదరాబాద్, మహబూబాబాద్, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భవనగిరి, నాగర్ కర్నూల్, హనుమకొండ, వనపర్తి, జోగులాంబ గద్వాల, సిద్దిపేట, వికారాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నారాయణపేట జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీచేసింది.