5 August, 2026 | 1:30 PM

ఆ మావోయిస్టుల భాష ఏంటి?

20-05-2024 12:49 AM

రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ ఫైర్

లోక్‌సభ స్థానాలు తాతముత్తాతల ఆస్తా?

మమ్మీ సీటని 8వ తరగతి పిల్లాడు కూడా చెప్పడు

బీజేపీ గెలుపు చరిత్రాత్మక అవసరమని వ్యాఖ్య

జంషేడ్‌పూర్, మే 19: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లక్ష్యంగా ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ మావోయిస్టుల భాష మాట్లాడుతున్నారని, అలా మాట్లాడితే పెట్టుబడిదారులు తమ పెట్టుబడులు పెట్టేందుకు 50 సార్లు ఆలోచిస్తారంటూ ఎద్దేవా చేశారు. ఆదివారం ఝా ర్ఖండ్‌లోని జంషేడ్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ను తీవ్రంగా దుయ్యబట్టా రు. కాంగ్రెస్ రాచరిక పాలనను ప్రోత్సహిస్తోందని, లోక్‌సభా నియోజకవర్గాలను వారి తాత ముత్తాతల ఆస్తి అనుకుంటోందని మండిపడ్డారు. అమేథీలో కాకుండా రాయ్‌బరేలీలో పోటీ చేయడంపై మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘రాయ్‌బరేలీ మా మమ్మీ సీటు అని 8వ తరగతి స్కూల్ పిల్లవాడు కూడా చెప్పడు’ అంటూ మోదీ ఎద్దేవా చేశారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో.. 

తమ ప్రభుత్వంలో ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తామని ప్రధాని మోదీ అన్నారు. ఏ బిల్లుపై అయినా కేబినెట్‌లో  చర్చ జరిగేటప్పుడు సంబంధిత అంశంపై ఏయే దేశాల్లో ఎలాంటి నిబంధనలు, చట్టాలు ఉన్నాయో పరిశీలిస్తామని వివరించారు. తమ ప్రభు త్వం వచ్చాకే ఇలాంటి అంతర్జాతీయ ప్రమాణాలు పాటించడం ప్రారంభించామని తెలిపారు.

మమతపై మోదీ ఫైర్.. 

రామకృష్ణ మఠం పెద్దలు బీజేపీకి కొమ్ముకాస్తున్నారంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు. ‘ఇస్కాన్, రామకృష్ణ మిషన్, భారత్ సేవాశ్రమ సంఘంపై లేనిపోని పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు. వాటిపై పుకార్లు వ్యాప్తి చేయడంలో టీఎంసీ అన్ని పరిధులు దాటింది. పశ్చిమ బెంగాల్ సీఎం వారిని బెదిరిస్తున్నారు. వాటి ఓటు బ్యాంకు కోసమే వారిని ఇలా బెదిరిస్తున్నారు’ అని మమతను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

బీజేపీ గెలుపు చారిత్రాత్మక అవసరం..

కేంద్రంలో మూడోసారి బీజేపీ గెలవడం చారిత్రాత్మక అవసరమని ప్రధాని మోదీ అన్నారు. ప్రజలకు తమ ప్రభుత్వంపై ఉన్న నమ్మకమే తమకు మూడోసారి విజయాన్ని అందిస్తుందని మోదీ వివరించారు. రికార్డు సాధించడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. ‘తమ బాధలు వినే, తమ కలలకు విలువ ఇచ్చే.. తమ బలాన్ని ప్రపంచానికి తెలియజేసే ప్రభుత్వం ఉందని దేశ ప్రజలు సంతోషంగా ఉన్నారు’ అని మోదీ పేర్కొన్నారు.