calender_icon.png 17 July, 2025 | 12:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నదీ జలాల సమస్యలపై ప్రత్యేక కమిటీ

17-07-2025 01:06:19 AM

- కృష్ణా జలాల వినియోగంపై టెలీమెట్రీ యంత్రాలు

- శ్రీశైలం డ్యామ్ మరమ్మతులకు ఏపీ అంగీకారం

- గోదావరి బోర్డు తెలంగాణలో.. కృష్ణా బోర్డు ఏపీలో..

- తెలంగాణ నీటి హక్కులను కేసీఆర్ ఏపీకి ధారాదత్తం చేశారు

- ఢిల్లీ భేటీలోని నిర్ణయాలన్నీ తెలంగాణ విజయాలే

- గొడవల కోసం కాదు.. సమస్య పరిష్కారం కోసమే మేమున్నం..

- ఢిల్లీలో మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, జూలై 16 (విజయక్రాంతి): ‘కేంద్ర జలశక్తి శాఖ సమావే శంలో బనకచర్ల అంశమే చర్చకు రాలే దు.. ఆంధ్రప్రదేశ్ వాళ్లు ప్రాజెక్టు కట్టుకుంటామని అడిగితే కదా తాము బనకచర్ల ఆపమని చెప్పడానికి.. సమావేశంలో ఆ ప్రస్తావనే రాలేదు’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించిన సమ స్యలను చర్చించడానికి అధికారులు, ఇంజినీర్లతో ఒక కమిటీని ఏర్పాటు చేసి, కమిటీలో చర్చించిన తర్వాత మిగిలిన అంశాలను సీఎంల స్థాయిలో చర్చించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు.

తెలం గాణ, ఏపీ మధ్య ఉన్న జల వివాదాల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ, ఏపీ మధ్య ఉన్న నదీ జలాల అంశాలపై చర్చించేందుకు ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బుధవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఇరు రాష్ట్రాల సీఎస్‌ల, కార్యదర్శులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.

సమావేశంలో తెలంగాణ 13 అంశాలను ప్రతిపాదించగా, ఏపీ గోదావరి బనకచర్ల ప్రాజెక్టు అనుసంధానం సింగిల్ పాయింట్ అజెండాను ప్రతిపాదించింది. ఇరు రాష్ట్రాల ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం అజెండాలో చేర్చింది. సమావేశ అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి మీడియా సమావేశం లో మాట్లాడారు.. నాలుగు అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయని తెలిపారు.

అధికారుల నివేదిక వచ్చిన తర్వాత నీటి కేటాయింపులకు, కొత్త ప్రాజెక్టులు, పాత ప్రాజెక్టుల అనుమతులు, ఏపీ కడుతున్న ప్రాజెక్టులకు సంబంధించి అభ్యంతరాలన్నింటినీ 30 రోజుల్లో గుర్తించి కమిటీ చర్చకు తీసుకొస్తుందని వివరించారు. ఇది అపెక్స్ కమిటీ భేటీ కాదని చెప్పారు. కృష్ణా బేసిన్‌లోని నీటి వినియోగంలో ఏపీ, తెలంగాణ ఎంత వాటా వినియోగించుకుంటుందో తెలుసుకునేందుకు టెలీమెట్రీ పెట్టాలని నిర్ణయించి సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చూపించామని తెలిపారు. టెలిమెట్రీ విధానానికి ఏపీ కూడా అంగీకరించిందని చెప్పా రు.

శ్రీశైలం డ్యామ్ డ్యామేజ్ అయిందని, తక్షణమే రిపేర్ చేయాలని ఎన్డీఎస్‌ఏ సహా ఇతర సంస్థలిచ్చిన నివేదికల ఆధారంగా డ్యామ్ నిర్వహణ బాధ్యతలపై ఏపీ కూడా ముందుకొచ్చినట్టు పేర్కొన్నారు. గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు, కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుల్లో తెలంగాణలో ఒకటి, ఏపీలో ఒకటి ఉండాలని పునర్విభజన చట్టంలో ఉందని, 2020 అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో కూడా నిర్ణయం జరిగిందని, దానిని అమలు చేయాలనుకున్నామని వెల్లడించారు. తెలంగాణ హక్కులను కేసీఆర్ గతంలోనే ఏపీకి ధారాదత్తం చేశారని మండిపడ్డారు. ఆయన చేసిన తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. పెం డింగ్ సమస్యల పరిష్కారం కోసం మాత్రమే ఈ సమావేశం జరిగిందని స్పష్టం చేశారు. 

కేంద్ర ప్రభుత్వానిది నిర్వాహక పాత్రే..

ఈ భేటీలో కేంద్ర ప్రభుత్వం కేవలం నిర్వాహక పాత్రే పోషించిందని, ఎవరి వైపు మాట్లాడలేదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. భేటీలో తీసుకున్న నిర్ణయాలన్నీ తెలంగాణ విజయాలేనని స్పష్టం చేశారు. అనుమానించుకుంటూ పోతే ముందుకు సాగలేమన్నా రు. సమస్యలను పరిష్కరించుకునేందుకు ఉన్నామని, గొడవలు పెట్టుకునేందుకు కాదన్నారు. చర్చ సఫలం కాకుంటే తప్పకుండా పోరాటం చేస్తామని, దేనికైనా సిద్ధమే అన్నా రు.

కానీ ఇప్పుడు ఆ అవసరం లేదని తెలిపారు. పునర్విభజన చట్టం, అపెక్స్ కమిటీ గతంలో సూచించిన మేరకు గోదావరి నది యాజమాన్య బోర్డును తెలంగాణలో, కృష్ణా నది యాజమాన్య బోర్డును ఏపీలో ఏర్పా టు చేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. కేసీఆర్, జగన్‌మోహన్‌రెడ్డి..ఇద్దరు ఏ సమస్యకూ పరిష్కారం చూపలేకపోయారని వి మర్శించారు. టెలిమెట్రీ పెట్టలేకపోయారని, బోర్డులు ఎక్కడ నిర్వహించాలో తేల్చలేకపోయారని, శ్రీశైలం డ్యామ్ రిపేర్ చర్చను వా యిదా వేసుకుంటువచ్చారని మండిపడ్డారు. కానీ ఈ సమావేశంలో ఆ సమస్యలకు పరిష్కారం లభించిందని చెప్పారు. 

ఇరు రాష్ట్రాలు కొట్టుకోవాలని కొందరు చూస్తున్నారు..

ఇరు రాష్ట్రాలు కొట్టుకుంటే తమకు బాగుంటుందని కొందరు అనుకుంటున్నారని, వారిని చూసి జాలి పడటం తప్ప ఏం చేయలేమని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాజకీయ ప్రయోజనం కోసం కొంద రు పెండింగ్ సమస్యలు పరిష్కారం కావొద్దని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు అవకాశం ఇచ్చినా పరిష్కరించలేదన్నారు.

వాళ్లకు సమాధానం ఇవ్వడానికి కాదు, తెలంగాణ ప్రజలకు జవాబుదారీగా తామున్నామని స్పష్టం చేశారు. పరిపాలన ఏ విధంగా చేయాలో తమకు తెలుసని, సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తమకు అవగాహన ఉందన్నారు. వివాదాలు చెలరేగకుండా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడమే తమ బాధ్యత అని స్పష్టం చేశారు. సమావేశంలో ఎంపీలు మల్లు రవి, అభిషేక్ మను సింఘ్వీ, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డి, రఘురాంరెడ్డి, కడియం కావ్య, సురేశ్ షెట్కార్, వంశీకృష్ణ, పోరిక బలరాం నాయక్ ఉన్నారు. 

తెలంగాణ అజెండాలోని అంశాలు

-పాలమూరు ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకానికి అనుమతులివ్వాలి.

-శ్రీశైలం నుంచి వేరే బేసిన్‌కు ఏపీ నీటి తరలింపు పనులను వెంటనే ఆపేయాలి.

-ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ప్రారంభించిన ప్రాజెక్టులకు సహకరించేలా కృష్ణా ట్రిబ్యునల్‌లో మద్దతుగా వాదించేలా ఏపీని ఒప్పించాలి. 

-కృష్ణానదీ జలాలను వేరే బేసిన్‌కు తరలించకుండా కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు చర్యలు తీసుకునేలా ఆదేశించాలి. కృష్ణా జలాలను అక్రమ తరలింపును అడ్డుకునేందుకు టెలిమెట్రీలను ఏర్పాటు చేసేందుకు ఏపీ అంగీకరించాలి. 

-తుంగభద్ర బోర్డు నీటి తరలింపుపై చర్చించాలి.

-రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంపై ఎన్జీటీ ఉత్తర్వులను అమలు చేసే విధంగా కేంద్ర జలశక్తి శాఖ చర్యలు తీసుకోవాలి. ఈ పథకంపై చట్టపరంగానే ముందుకు వెళ్లాలి. శ్రీశైలం కుడి కాల్వద్వారా ఎక్కువ నీటి తరలింపును నియంత్రించాలి.

-శ్రీశైలం కుడి కాలువ ద్వారా ఎక్కువ నీటి తరలింపును నియంత్రించాలి.

-శ్రీశైలం ప్రాజెక్టులో కొత్త ప్రాజెక్టులు హంద్రీనీవా, వెలిగొండ, గురు రాఘవేంద్ర నిర్మాణాలను నియంత్రించాలి.

-శ్రీశైలం డ్యామ్ సేఫ్టీకి తగిన చర్యలు తీసుకోవాలి. 

- శ్రీశైలం నుంచి నీటి తరలింపు ద్వారా విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలుగుతోంది. దీనిని అడ్డుకోవాలి. 

- పోలవరం ప్రాజెక్టు తరహాలోనే ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభు త్వం నిధులు ఇవ్వాలి. ఇచ్చంపల్లి నుంచి కావేరికి గోదావరి జలాల తరలింపునకు మేం సిద్ధం. అందులో 200 టీఎంసీల నీటిని వాడుకునేందుకు అనుమతులివ్వాలి.

- సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు అనుమతులివ్వాలి.

- ప్రాణహిత సుజల స్రవంతి ప్రాజెక్టుకు ఏఐబీపీ కింద నిధులు ఇవ్వాలి. మహారాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వమే చర్చలు జరిపి తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణానికి సహకరించాలి. 

టెలీమెట్రీ విధానానికి ఏపీ అంగీకారం: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కృష్ణా నది జలాశయాల వినియోగంలో ఆంధ్రా, తెలంగాణ ఎంతెంత వాడుకుంటున్నాయో నిర్ధారించడానికి గాను టెలీమెట్రీ పరికరాల ఏర్పాటుకు ఏపీ అంగీకరిం చిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. కృష్ణా నదీ జలాల వినియోగం లెక్కలపై అనుమానాలున్నాయని, టెలీమెట్రీలు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినట్టు తెలి పారు.

కేంద్రం నిధులు ఇవ్వకపోయినా రాష్ట్రమే నిధులు కేటాయిస్తుందని చెప్పినట్టు పేర్కొన్నారు. వీటి ఏర్పాటుపై గత ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించిందన్నారు. శ్రీశైలం డ్యామ్ పరిస్థితిని వివరించడంతో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని ప్రస్తావించినట్టు తెలిపారు. స్పందించిన కేంద్రం శ్రీశైలం డ్యామ్ మరమ్మతులకు తక్షణం పూనుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిందన్నారు.