పాఠశాలలో బాలికల ప్రవేశంపై ప్రత్యేక శ్రద్ద
రాజన్న సిరిసిల్ల : జిల్లావ్యాప్తంగా జరుగుతున్న బడిబాట కార్యక్రమంలో పాఠశాలలో బాలికల నమోదు శాతం పెంపొందించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి బాలిక తప్పనిసరిగా పాఠశాలల్లో ఎనరోల్ అయ్యే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో బడిబాట కార్యక్రమం నిర్వహణ పై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు ప్రతి ఇంటిని సందర్శించి పిల్లలంతా తప్పనిసరిగా పాఠశాలల్లో విద్యార్థులుగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా బాలికల ఎనరొల్మెంట్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలికలు ఎక్కడ డ్రాప్ ఔట్ కాకుండా చూడాలని, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సైతం బడిబాట కార్యక్రమంలో పాల్గొంటూ బాలికలు ఎక్కడ విద్యకు దూరం కాకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట బాలికల తల్లిదండ్రులకు విద్య ప్రాముఖ్యత పై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. బాలికలు పదవ తరగతి ముగిసిన తర్వాత కూడా ఇంటర్ చదివేల వారి తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రతి మండల సూపర్వైజర్ వారి పరిధిలో గల బాలికల పై శ్రద్ధ వహిస్తూ వారు చదువు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా శారీరక లోపంతో ఉన్న చిన్నారుల వివరాలు సేకరించాలని, వారికి సైతం విద్యా అందించే దిశగా చర్యలు తీసుకోవాలని, దివ్యాంగుల చిన్నారుల జాబితాను సమర్పించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు పట్టణాలలో వార్డు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడ బాల కార్మికులు తప్పకుండా చర్యలు తీసుకోవాలని, పిల్లలంతా తప్పనిసరిగా పాఠశాలలో నమోదు కావాలని అన్నారు. పరిశ్రమలు, హోటల్స్, ఇట్టుక బట్టిలను తనిఖీ చేసి ఎవరైనా బాల కార్మికులు కనిపిస్తే వారిని వెంటనే పాఠశాలల్లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. వలస కూలీల పిల్లలు సైతం పాఠశాలలో నమోదయ్యేలా జాగ్రత్త వహించాలని అన్నారు. ఉపాధి హామీ కూలీల కింద నమోదై జాబ్ కార్డ్ కలిగిన ప్రతి కుటుంబంలో పిల్లలు చదువుకుంటున్నారో లేదో పరిశీలించాలని, నిడదలు చదువుకొని పక్షంలో వెంటనే వారిని ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థులుగా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.






