మంగంపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా
మంగంపల్లిలో ప్రత్యేక గ్రామసభ నిర్వహణ
పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి
వనపర్తి,(విజయక్రాంతి): పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి పేర్కొన్నారు. గురువారం పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా ప్రత్యేక గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో పాటు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మండల స్థాయి అధికారులు రోడ్డు భద్రత, బాల్యవివాహాల నిర్మూలన, వర్షాకాలం నేపథ్యంలో ఇంకుడు గుంతల ఏర్పాటు, పరిసరాల పరిశుభ్రత, వన మహోత్సవం, జల సంరక్షణ, పాఠశాలల్లో సౌకర్యాలు సహా తదితరాంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి ప్రజల మెప్పు పొందుతుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పైనే సీఎం తొలి సంతకం చేశారని గుర్తు చేశారు. కేవలం వనపర్తి నియోజకవర్గం లోని మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం 30 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు.
తన సొంత గ్రామమైన మంగంపల్లిని ఇందిరమ్మ ఇండ్ల పథకానికి పైలట్ గ్రామంగా ఎంపిక చేసి ఇండ్ల నిర్మాణం చేయడం జరుగుతుందని తెలిపారు. మంగంపల్లి గ్రామంలో ఒక్క పూరిగుడిస కూడా లేకుండా అన్ని పక్క ఇండ్లే ఉండే విధంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే నూతన గ్రామపంచాయతీ, అంగన్వాడీ భవనాలతో పాటు సిసి రోడ్లు డ్రైనేజీలను కూడా పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేయడం కోసం తన వంతుగా రూ. 10 లక్షలు కేటాయిస్తానని, జిల్లా కలెక్టర్ ద్వారా మరో రూ.10 లక్షలు తెప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంగంపల్లి గ్రామంలోని ప్రతి ఇంటికి సి ఎస్ ఆర్ నిధులతో సోలార్ ఏర్పాటు చేయించేందుకు కృషి చేస్తానని తెలిపారు. గ్రామంలో ఇప్పటికే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించడం జరిగిందని తెలిపారు. గ్రామంలోని ప్రతి ఒక్కరు ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. గ్రామంలో ఏ కార్యం జరిగిన ఐదు మొక్కలు నాటే పద్ధతిని ప్రారంభించాలని తద్వారా మన గ్రామాన్ని మోడల్ గా తీర్చిదిద్దేందుకు అడుగులు పడాలని సూచించారు. రైతులు కూడా కేవలం వరి మాత్రమే కాకుండా పంట మార్పిడి పద్ధతిని అవలంబించాలని సూచించారు.పామాయిల్ వంటి తోటలను పెట్టేందుకు మొగ్గు చూపాలన్నారు. మహిళలు కూడా ఏదైనా వ్యాపారం చేసేందుకు ముందుకు వస్తే రుణ సదుపాయాన్ని కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా నేడు నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో మంగంపల్లి గ్రామ సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులందరూ ఉపాధి హామీ కింద ఇంకుడు గుంతలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలియజేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. మంచి నిర్ణయం తీసుకున్న గ్రామ పాలకవర్గాన్ని అభినందిస్తున్నానని తెలిపారు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా గ్రామంలో భూగర్భ జలాలు పెరిగి మంచినీటి సదుపాయాలు కలుగుతాయి అన్నారు. అదేవిధంగా గ్రామంలో గత ఐదేళ్ల వ్యవధిలో 18 ఏళ్ల నుండి 50 ఏళ్లలోపు వ్యక్తులు ఎవరైనా మరణిస్తే జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ద్వారా దరఖాస్తు చేసుకొని రూ. 20 వేల లబ్ధి పొందవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమేష్, ఎంపీడీవో పరిణత, ఎస్సై జలంధర్ రెడ్డి, వార్డు సభ్యులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, మండల అధ్యక్షులు, ప్రజలు, ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






