వినతుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు
జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే
కుమ్రం భీం అసిఫాబాద్,మే 12(విజయ క్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన వినతుల పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్ రావు లతో కలిసి అర్జిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.
జైనూర్ మండలం ఊహేగాం, పోచంలొద్ది గ్రామాలకు చెందిన రైతులు తమ పంపుసెట్లు, వ్యవసాయ బావులకు త్రీ ఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. పెంచికల్ పేట మండలం గుంట్లపేట గ్రామానికి చెందిన గిరుగుల సాగర్ తాను దివ్యాంగుడినని తనకు పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.
ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామానికి చెందిన బొమ్మకంటి మంజుల తన దివ్యాంగ ధ్రువపత్రం పునరుద్ధరించి తనకు వచ్చే దివ్యాంగ పింఛన్ ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. వాంకిడి మండలం ఖమాన గ్రామానికి చెందిన జాడి జయబాయి తనకు రావలసిన వారసత్వ భూమి తనకు రాకుండా ఇతరులకు విక్రయించడం జరిగిందని, ఈ విషయమై న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.
ఆసిఫాబాద్ మండలం అప్పపెల్లి గ్రామానికి చెందిన చునార్ కర్ లక్ష్మి తన భూమి కొలతలు జరిపి హద్దులు నిర్ధారించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. బెజ్జూర్ మండలం రెబ్బెన గ్రామానికి చెందిన పొట్టి ధర్మయ్య తాను బెజ్జూర్ సహకార బ్యాంకు నుండి ట్రాక్టర్ రుణం 5 లక్షల రూపాయలు పొందేనని, ఎలాంటి బాకీ లేకుండా పూర్తిగా చెల్లించానని, కానీ తాను బకాయి ఉన్నట్లు నోటీసు జారీ చేశారని, ఈ విషయమై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు.
కౌటాల మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన గంధం మంజుల బాయి తనకు షెడ్యూల్డ్ కులాల కార్పొరేషన్ నుండి బోరు బావి, విద్యుత్ సౌకర్యం మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. రెబ్బెన మండలం రాళ్లపేట గ్రామానికి చెందిన రెడ్డి ఉమారాణి నిరుపేద అయిన తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు.
రెబ్బెన మండలం పర్సనంబాల గ్రామానికి చెందిన ఆదే యాదవ్ తనకు 65 సంవత్సరాల వయసు ఉందని, వృద్ధాప్య పింఛన్ ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను అధికారుల సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, అర్జీదారులు పాల్గొన్నారు.






