13 March, 2026 | 1:39 AM

యాష్ లారీలతో బేజార్..!

13-03-2026 12:00 AM
  1. అధిక లోడు... ఇష్టారాజ్యంగా రవాణా 
  2. రోడ్డుపై పడుతున్న బూడిద...
  3. ఇబ్బందుల్లో వాహన చోదకులు. 
  4. చోద్యం చూస్తున్న అధికారులు. 

భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 12, (విజయక్రాంతి): ప్రజల కళ్ళల్లో బూడిద పడితే ఏంటి... రోడ్లు శిథిలమైతే మాకేంటి.. నిబంధనలతో పనేంటి అన్నట్లుగా ఉంది యాస్ తోలకాల వ్యవహారం. నిబంధనలో పాటించకుండా ఇసుక, బూడిద తోలకాలు యదేచ్ఛగా సాగుతున్న నియంత్రించాల్సిన సంబంధిత శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అధిక లోడుతో, మోతాదుకు మించి బూడిదను వాహనాల ద్వారా తరలిస్తుంటే గాలికి ఎగిరి వెనుక ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహన చోదకుల కళ్ళలో పడి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు రోడ్లో శిథిలమై గోతుల మయంగా మారుతుంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ మండల పరిధి లోని కేటీపీఎస్ బూడిద చెరువు నుంచి యాష్ తోలకాలకు యాజమాన్యం అనుమతులు ఇచ్చింది. వచ్చిన అనుమతులను నిబంధనల ప్రకారం అమలు చేయకుండా ఇష్టరాజ్యంగా అధిక లోడుతో దూల కాలు నిర్వహిస్తున్నారు. బూడిద కారణంగా ప్రజలకు శ్వాసకోశ వ్యాధుల సైతం ప్రభలే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

పాల్వంచ పట్టణ పరిధిలోని అల్లూరి సెంటర్, అంబేద్కర్ సెంటర్,జిల్లా కేంద్రంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద, పోస్ట్ ఆఫీస్ ఏరియాలో యాష్ పౌడర్ రోడ్లపై పడుతోంది. ఇరువైపులా ఉన్న వ్యాపార సముదాయంలోకి గాలిలో కలిసి దుకాణంలోకి వెళ్లడంతో సరుకులు కలుషితమవుతున్నాయి. ఓవర్ లోడుతో అడ్డదిడ్డంగా లారీలు నడపడం వల్ల  ట్రాఫిక్ జామ్ కావడంతో పాటు అంబులెన్స్ సైతం దారి దొరక్క ఇబ్బందులు పడుతున్న సంఘటనలు లేకపోలేదు.

నిత్యం వందల లారీలు నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తున్న పోలీస్ శాఖ అధికారులు , రవాణా శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు ఆరోపణలకు దారితీస్తోంది. ప్రమాదాలు చోటు చేసుకున్న తర్వాత హడావుడి చేయటం కన్నా, ముందస్తుగానే నిబంధనల ప్రకారం వాహనాలు ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.