అమ్మ జాతీయ జెండాను ముద్దాడింది
మళ్లీ వస్తానమ్మ అని అమ్మకు
మాటిచ్చి వెళ్ళాడు!
కొన్నాళ్ళ తర్వాత ఓ మూటలో
ముద్దలా వచ్చాడు ఇంటికి!
మన త్రివర్ణ పతాకాన్ని గట్టిగా కౌగిలించుకుని
కార్గిల్ పోరాటపు సగర్వంతో కన్ను మూశాడు..!
అమ్మకిచ్చిన మాట తప్పాడు
తన తండ్రి దున్నే పొలంలో మట్టై మిగిలాడు..!!
ఇంత వేదనలో కూడా ఆ తల్లి కంటిలో
వెలుగునే చూశారు ఆ జనం..!
మరో భగత్‌సింగ్ నా కొడుకంటూ
ఆ తల్లి గుండెలు బాదుకుంటుంటే
భరతమాత నిశ్శబ్దంగా యుద్ధం చేస్తుంది
భావితరపు అందమైన భవిష్యత్ కోసం..!!
ఊరు ఊరంతా నా జాతీయ జెండాలతో
వందేమాతరపు ప్రతిధ్వనులతో
గట్టిగానే గర్జిస్తున్నారు
సరిహద్దులోని సైనికులారా మీకు
మేమున్నామని..
వాళ్ళందరికీ వినిపించాలని..!!
ఆ రోజు వేలాది ఉద్వేగాల ఊపిరి
శ్వాస శబ్దాల మధ్య ఆ దేశ రక్షకుడు
మన జనగణమన గీతంలో
అక్షరమై మిగిలిపోయాడు..!
మళ్ళీ మరో ఉదయం..
మరో ఉద్యమం కోసం..
పొలంలో ఓ చిన్న మొక్క మొలిచింది..!!
యుద్ధమేదైనా .. ప్రత్యర్థి ఎంతటి వారైనా
దేశం అంటే మాత్రం ఓ యోధుడిలా..
ప్రకాశించమని..ప్రాణాలివ్వమని
ఆ మొక్క ఏదో పాఠం చెబుతుంది..!!
అది అర్థం చేసుకున్న ఆ అమ్మ..
మళ్లీ ఓసారి మన జాతీయ
జెండాను ముద్దాడింది..!!
తన కొడుకు మరో భగత్‌సింగ్ అనే గర్వంతో..!
వరదలా వస్తున్న తన కన్నీళ్లను ఆపుకోలేక..!!
ఫిజిక్స్ అరుణ్ కుమార్
సెల్: 9394749536






