భద్రాచలం రోటరీ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు
భద్రాచలం,(విజయక్రాంతి): రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ 3150 గవర్నర్ ఉదయ్ సుదీర్ బిలానీ భద్రాచలం రోటరీ క్లబ్ అధికారిక పర్యటనలో భాగంగా భద్రాచలంలోని శ్రీ వెంకటేశ్వర హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డిస్ట్రిక్ట్ పరిధిలోని 109 రోటరీ క్లబ్‌లలో భద్రాచలం రోటరీ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని గవర్నర్ ఉదయ్ సుదీర్ బిలానీ అన్నారు.
గత 40 సంవత్సరాలుగా క్లబ్ పూర్వ అధ్యక్షులు, సభ్యులు సమాజ సేవకు ప్రాధాన్యతనిస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ భద్రాచలం ప్రాంతంలో క్లబ్‌కు ప్రత్యేక స్థానం తీసుకువచ్చారని అభినందించారు. భద్రాచలం ఒక ప్రముఖ పుణ్యక్షేత్రమని, అధికారిక పర్యటనలో భాగంగా ఉదయం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంను దర్శించుకున్నట్లు తెలిపారు. సీతారామచంద్రస్వామి ఆశీస్సులతో భద్రాచలం ప్రాంతానికి అవసరమైన సేవా కార్యక్రమాలను చేపట్టేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు.
భద్రాచలం రోటరీ క్లబ్ ద్వారా ప్రజలకు మరింత ఉపయోగపడే విధంగా ఒక పెద్ద ప్రాజెక్టును ఈ ప్రాంతంలో చేపట్టేందుకు ప్రాధాన్యత ఇస్తానని గవర్నర్ హామీ ఇచ్చారు. ప్రజా అవసరాలను గుర్తించి రోటరీ సేవలను మరింత విస్తరించేందుకు క్లబ్ సభ్యులతో కలిసి పనిచేస్తానని పేర్కొన్నారు.






