రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
బాన్సువాడ,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణ సిఐ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం బాన్సువాడ పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన జల్సాని కిషోర్ (43), ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు.ఆదివారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో వ్యక్తిగత పనులు ముగించుకుని తన ఎలక్ట్రిక్ స్కూటీపై ఇంటికి బయలుదేరారు.
బోధన్ రోడ్డులోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు సమీపానికి చేరుకోగానే వర్షం పడుతుండటంతో స్కూటీ అదుపుతప్పి కిందపడిపోయింది.ఈ ప్రమాదంలో కిషోర్ తలకు, శరీరంలోని ఇతర భాగాలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు ఆయన తెలిపారు. మృతుడి భార్య సారిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సిఐ తెలిపారు.






