25 August, 2026 | 12:05 AM

గ్రామస్థాయిలో సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కల్పించాలి

24-08-2026 10:55 PM

నెల్లికుదురు,(విజయక్రాంతి): ఫిర్యాదుదారుల సమస్యలను సకాలంలో పరిష్కరిస్తూ ప్రో యాక్టివ్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం సిబ్బందితో మాట్లాడిన ఎస్పీ వారి విధుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బ్లూ కోట్స్ విధులు, వీఓపీల గ్రామాల సందర్శనలు, సమాచార సేకరణ, సీసీటీఎన్‌ఎస్ నిర్వహణ, స్టేషన్ రైటర్ల విధులు తదితర అంశాలను సమీక్షించారు.

ఫిర్యాదులతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరి పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, వారి సమస్యలను సకాలంలో పరిష్కరించి తగిన సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా మర్యాదపూర్వకంగా, పారదర్శకంగా విధులు నిర్వహించాలని తెలిపారు. నేరాల నివారణలో భాగంగా బైండోవర్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ వారి కదలికలను పర్యవేక్షించాలని సూచించారు.

గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, గుడుంబా తయారీ మరియు అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాత్రి వేళల్లో నైట్ పెట్రోలింగ్‌ను ముమ్మరం చేసి నేరాలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తంగా గస్తీ నిర్వహించాలని తెలిపారు. గ్రామస్థాయిలో సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఎస్పీ సూచించారు.

వీఓపీలు, బ్లూ కోట్స్ సిబ్బంది గ్రామాల్లో పర్యటించే సమయంలో ఫేక్ లోన్ యాప్స్, OTP మోసాలు, అనుమానాస్పద లింకులు, సోషల్ మీడియా మోసాలు, డిజిటల్ అరెస్టులు వంటి సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930కు సమాచారం అందించేలా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలకు చేరువగా, ముందస్తు సమాచారంతో నేరాలను అరికట్టే విధంగా ప్రో-యాక్టివ్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ సిబ్బందికి సూచించారు. విధి నిర్వహణలో ఏవైనా సమస్యలు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.