శిల్పారామంలో అద్భుత నృత్య కళాప్రదర్శన
చెన్నై కళాకారిణి రవళి,ఉమాదేవి శిష్యుల ప్రతిభకు ప్రేక్షకుల ప్రశంసలు
శేరిలింగంపల్లి,ఆగస్టు 16(విజయక్రాంతి): నగరంలోని మాదాపూర్ శిల్పారామం ఆదివారం కళాప్రియులకు ఒక విందుగా మారింది. చెన్నై నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన భరతనాట్య కళాకారిణి రవళి మ్యాలవరపు అందించిన ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఆమె మాధవ పంచకం, నగుమోము, స్మరసుందరాంగుని, బృందావని తిల్లాన వంటి అంశాలను అత్యంత నైపుణ్యంతో ప్రదర్శించి ప్రేక్షకులను అలరించింది.ఇదే కార్యక్రమంలో ఆర్‌ఆర్ కూచిపూడి డాన్స్ అకాడమీ గురువు ఉమాదేవి శిష్యబృందం కూచిపూడి నృత్యంలో తమ ప్రతిభను చాటుకుంది.
మూషిక వాహన, వండేవని భావన, భోశంభో, సిరుతానవ్వులవాడు, బాలకనకయ్య, రామాయణ శబ్దం, జనుత శబ్దం, బ్రహ్మాంజలి వంటి అంశాలను హరిణి, పల్లవి, వేదశ్రీ, స్ఫూర్తి, హర్షిత, అదితి, లాలోయిత, ప్రసూనా, కిరణ్మయి, దీప్తిక, గాయత్రీ, సింధు తదితర యువ కళాకారులు సమూహంగా ప్రదర్శించి ప్రేక్షకుల కరతాళ ధ్వనులను సొంతం చేసుకున్నారు.ప్రముఖ నాట్య గురువులు డాక్టర్ ప్రసన్న రాణి, డాక్టర్ శేషుబాబు, కృష్ణప్రియ, రజిని మల్లాది వంటి వారు ఈ కళాకారుల ప్రదర్శనను ప్రశంసిస్తూ, యువతలో సాంప్రదాయ కళల పట్ల పెరుగుతున్న ఆసక్తిని అభినందించారు.






