50 ఏండ్ల అపూర్వ కలయిక
హాజరైన ఎంఎల్‌ఏ పీఎస్‌ఆర్
మంచిర్యాల టౌన్, ఆగస్టు 16 : మంచిర్యాల బాలుర ఉన్నత పాఠశాలలో 1975 - 76 సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకున్న బ్యాచ్ 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించుకున్న అ‘పూర్వ’ విద్యార్థుల సమ్మేళనానికి పెద్ద ఎత్తున బ్యాచ్ మెట్ లు హాజరయ్యారు. స్నేహానికి మించింది మరోటి లేదు అనడానికి 50 ఏండ్ల తర్వాత కూడా పదో తరగతి విద్యార్థులు ఒక్క చోటికి చేరి వారి మధురజ్ఞాపకాలను పంచుకోవడమే నిదర్శనం...
10వ తరగతి చదువుకున్న 120 మంది విద్యార్థులకు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ అపూర్వ కలయిక సమ్మేళన కార్యక్రమానికి దాదాపు 80 మంది విచ్చేసి వారి గత స్మృతులను నెమరేసుకుంటూ చదువుకున్న కాలంలో వారు చేసిన చిలిపి పనులు, తోటి విద్యార్థులతో మిగిలిన తీరును నెమరేసుకుంటూ ఆనందంగా గడిపారు. చదువుకొని 50 ఏండ్లు పూర్తయినప్పటికీ నిత్య నూతన విద్యార్థులుగా మారి స్నేహితులతో 60లో 20లా ఆనందంగా ఆడుతూ పాడుతూ గడిపారు.
ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల ఎంఎల్‌ఏ కొక్కిరాల ప్రేం సాగర్ రావు హాజరై మాట్లాడారు. ఎన్నేళ్లయినా స్నేహితుల కలయిక ఓ మధురానుభూతిని కలిగిస్తుందన్నారు. ఇందులో అనేకమంది ఇంటర్ లో తనతో పాటు చదివారని గుర్తు చేసుకున్నారు. స్నేహానికి విలువ నిస్తూ ఇన్నేళ్లు గడిచిన ఇంకా ఒకరినొకరు గుర్తుంచుకొని వివిధ రంగాల్లో ఉన్న వారంతా పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ నుంచో ఇక్కడికి వచ్చి కలవడం ఆనందంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. అనంతరం ఎమ్మెల్యేను తోటి స్నేహితునిగా వీరంతా సత్కరించారు. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమంలో మంచాల రఘువీర్, కొత్త కాలేశ్వర్, కొత్త ముక్తేశ్వర్, గాదాస్ వెంకటరమణ, గడ్డం సూర్యప్రకాష్, తోట చంద్రమౌళి, మోటూరి భాస్కర్, అన్వర్, వీటి ప్రసాద్ తోపాటు నాటి పదో తరగతి విద్యార్థులు పాల్గొన్నారు.






