ఆలయాభివృద్ధి పనుల్లో వేగం పెంచండి
- శృంగేరి పీఠాధిపతి సూచనలు పరిగణనలోకి తీసుకోవాలి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
- వేములవాడలో అధికారులతో సమీక్ష
వేములవాడ, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): రాజన్న ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేసి భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఆలయ విస్తరణ పనులను దేవాదాయశాఖ ఇన్‌చార్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ హనుమంతరావు, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్‌తో కలిసి బుధవారం పరిశీలించారు.
80 అడుగుల రహదారి విస్తరణ, బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ తదితర పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆలయ అభివృద్ధి పనులు ఆగమశాస్త్రానికి అనుగుణంగా చేపట్టాలని, శృంగేరి పీఠాధిపతి సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకోవాలని శ్రీనివాస్ సూచించారు.
ప్రస్తుతం రూ.76 కోట్లతో ఆలయ అభివృద్ధి, రూ. 35 కోట్లతో అన్నదాన సత్రం, రూ. 99.40 కోట్ల పనులు టెండర్ దశలో ఉన్నాయని హనుమంతరావు తెలిపారు. సమీక్ష లో ఆర్డీఓ కేఎస్‌బీ కుమారి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ బీమ్లా నాయక్, ఈఈ రాజేష్, తహశీల్దార్ జయంత్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.






