ఆరోగ్యాలనుకాపాడుకోవాలి
- వ్యాధుల ముందస్తు గుర్తింపు ఎంతో మేలు
- మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ
- బాలానగర్‌లో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ప్రారంభం
బాలానగర్, సెప్టెంబర్ 2: అందుబాటులోకి వచ్చిన అరుదైన అవకాశాలని సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యాలను ప్రలజు కాపాడుకోవాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ సూచించారు. బుధవారం ఎంపీపీ కాన్ఫరెన్స్ హాల్‌లో ఫ్యూలింగ్ గ్రోత్ ఫౌండేషన్ (Fueling Growth Foundation) ఆధ్వర్యంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వైద్య బృందం సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్‌ను ఎంపీ డీకే అరుణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. మహిళలు క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రస్తుతం ముందస్తు పరీక్షల ద్వారా వ్యాధిని త్వరగా గుర్తించి తగిన చికిత్స అందించవచ్చన్నారు. రాష్ర్టంలో సుమారు 50- వేల మంది క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, మహబూబ్‌నగర్ జిల్లాలో 359 మంది మహిళలు క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలిపారు.
ఈ క్యాంప్‌లో వివిధ రకాల క్యాన్సర్లకు సంబంధించిన పరీక్షలతో పాటు, వ్యాధి గుర్తించిన వారికి ఏ దశలో ఉందో, ఎలాంటి చికిత్స అవసరమో వైద్య నిపుణులు సూచనలు అందిస్తారని తెలిపారు. క్యాన్సర్ నివారణలో హెచ్పిటీ వ్యాక్సిన్ కీలకమని, 9 ఏళ్ల బాలికలకు రెండు డోసులు, 14-- ఏళ్ల యువతులకు మూడు డోసుల వ్యాక్సిన్‌ను ప్రభుత్వం అందిస్తోందన్నారు. బాలానగర్ మండలంలో రెండు రోజుల పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ కొనసాగుతుందని, మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ కోరారు.
త్వరలో మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ కుష్బూ గుప్తా, డీఎంహెఓ శ్రీనివాసులు, క్యాన్సర్ వైద్య నిపుణులు రవికుమార్, బీజేపీ నాయకులు జనార్దన్‌రెడ్డి, జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు సాయినాథ్, బాలానగర్ మండల బీజేపీ అధ్యక్షుడు గోపాల్ నాయక్, రాజాపూర్ మండల అధ్యక్షుడు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.






