బోడ కాకరకాయ అధరహో!
కిలో@400
బోడ కాకరకాయ అడవిలో సంప్రదాయంగా లభించే ఒక కూరగాయ. ఇది కాకరకాయ కుటుంబానికి చెందినప్పటికీ, సాధారణ కాకరకాయతో పోలిస్తే చిన్నగా, గుండ్రంగా లేదా అండాకారంలో ఉండి, బయట చిన్న ముళ్లతో ఉంటుంది. ప్రస్తుత వర్షాకాలంలో ఇది ఎక్కువగా లభిస్తుండటంతో వీటిని ప్రత్యేకంగా సేకరించి అడవి నుండి తెచ్చి విక్రయిస్తున్నారు. ధర కిలో రూ.400 వరకు పలుకుతోంది.
సీజన్‌లో లభించే అడవి జాతి కాకరకాయ ధర ఎంతైనా పరవాలేదంటూ.. కొని తినడానికే ప్రజలు అమితమైన ఆసక్తి చూపిస్తున్నారు. ఇది వర్షాకాలంలోనే ఎక్కువగా లభిస్తుంది. అడవుల్లో, పొలాల కంచెల వద్ద తీగలపై పెరుగుతుంది. రుచి స్వల్ప చేదుతో పాటు చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. బోడ కాకరకాయ వేపుడు కూర, పప్పుతో కలిపి ఉల్లిపాయ, వెల్లుల్లితో మసాలా ఫ్రై చేయవచ్చు.
పోషక విలువలు..
బోడ కాకరకాయలో విటమిన్ సీ, విటమిన్ ఏ, ఫైబర్, కాల్షియం, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు కొంతమేర సహాయపడవచ్చు. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచేందుకు తోడ్పడుతుంది. తక్కువ కేలరీలు ఉండటం వల్ల బరువు నియంత్రణకు ఉపయోగపడుతుంది.






